మహబూబ్‌నగర్ క్రైం: ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్థాపానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్‌టౌన్ సీఐ అప్పయ్య వివరాల మేరకు.. 2009 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్ (38) జిల్లా కేంద్రంలోని గౌడ్స్ కాలనీలో నివాసముంటూ.. స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో మోటార్ ట్రాన్స్‌ఫోర్ట్ సెక్షన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతడికి ఏడాది క్రితం రోడ్డు ప్రమాదం జరగడంతో తల, చేతులకు గాయాలయ్యాయి. దీంతో ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో రెండు, మూడు రోజుల నుంచి తన జీవితం మొత్తం అయిపోయిందని చెబుతూ.. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు భోజనం చేసి నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి శ్రీనివాస్ ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
యువకుడి బలవన్మరణం
లింగాల: మండలంలోని అంబట్‌పల్లికి చెందిన చింతకింది బాబు (30) బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. ఆయన కథనం మేరకు.. బాబు బల్మూర్‌లోని ఓ మద్యం దుకాణంలో రోజువారి కూలీగా పని చేసేవాడు. బుధవారం వ్యవసాయ పొలానికి వెళ్లి అక్కడ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతికిగల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించినట్లు ఎస్‌ఐ వివరించారు.
కారు, బైక్ ఢీ: ఒకరి మృతి
తాడూరు: కారు, బైక్ ఢీ కొని ఒకరు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు సమీపంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గురుస్వామి కథనం ప్రకారం.. గుంతకల్ గ్రామానికి చెందిన కోడేల చంద్రయ్య(35) తన పొలం నుంచి బైక్‌పై గ్రామానికి బయల్దేరాడు. కల్వకుర్తి మండలం తర్నికల్ నుంచి తాడూరు వైపునకు వస్తున్న కారు ఢీకొనడంతో చంద్రయ్య తీవ్ర గాయపడ్డాడు. వెంటనే ఆయనను కల్వకుర్తిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు..
నారాయణపేట రూరల్: కర్ణాటకకు చెందిన ఓ వృద్దుడు రాష్ట్ర సరిహద్దులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిటకల్ తాలూకా పరమేశ్‌పల్లికి చెందిన మల్లపొల్ల మొగలప్ప (59)కు అన్పూర్, జలాల్‌పూర్ గ్రామాల్లో చుట్టాలున్నారు. అప్పుడప్పుడు ఆయా గ్రామాలకు వచ్చి వెళ్లేవాడు. ఎప్పటిలాగే ఈ నెల 16న జలాల్‌పూర్ వెళ్తున్నట్లు చెప్పి ఊరు నుంచి వెళ్లాడు. అతడు రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో బంధువుల ఇంటికి ఫోన్‌చేసి ఆరా తీయగా.. రాలేదని చెప్పడంతో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం జలాల్‌పూర్ గ్రామ శివారులో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్లి చూడగా ఒంటిపై రక్తగాయాలు కనిపించడంతో అనుమానాలు వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు
● ఇంటర్ పరీక్షకు గైర్హాజరు
శాంతినగర్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురై గాయాలపాలయ్యారు. స్థానికుల వివరాల మేరకు.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సుభాష్, మానవపాడు మండలం గోకులపాడుకు చెందిన మరో విద్యార్థి శివయ్య అయిజలో పరీక్ష రాసేందుకు బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యంలోని జూలెకల్ శివారులో వీరు వెళ్తున్న బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. దీంతో ఇంటర్ మొదటి సంవత్సరం చివరి పరీక్షను వారు రాయలేకపోయారు.
ఆర్థిక ఇబ్బందులతోఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతోఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య