అడ్డాకుల: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేలా సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మూసాపేట మండలం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు చికిత్స చేసే గది, ల్యాబ్, మందులు, కాన్పుల వివరాల గురించి వాకబు చేశారు. చికిత్స కోసం పీహెచ్‌సీకి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వేసవికాలంలో వడదెబ్బకు గురై ఆస్పత్రికి వచ్చే రోగులకు తగిన చికిత్స అందించి రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలని కోరారు. ఆస్పత్రిలో నిల్వ ఉన్న మందులను ఎప్పటికప్పుడు పరిశీలించి కాలంచెల్లిన వాటిని తొలగించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. డా.షబానాబేగం తదితరులున్నారు.
ఆందోళనకు గురికావొద్దు
భూత్పూర్ : పదో తరగతి విద్యార్ధులు పరీక్షలంటే ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం రాత్రి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో రాత్రి బస చేశారు. పదో తరగతి విద్యార్ధినులు పరీక్ష కేంద్రానికి వెళ్లిన వెంటనే కొద్ది సేపు రిలాక్స్ కావాలని, మెడిటేషన్ చేయాలని ఆమె సూచించారు. అనంతరం పాఠశాలలో వసతులు, భోజనం, ఆటస్థలం తదితర విషయాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. డీఈఓ ప్రవీణ్‌కుమార్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ జరీనా బేగం, గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ రమాదేవి, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి ఇందిర, తహసీల్దార్ జయలక్ష్మి, ఎంపీడీఓ ప్రభాకర్, ఎంఈఓ ఉషారాణి, కేజీవీబీ ప్రిన్సిపాల్ శైలజా, సిబ్బంది తదితరులు ఉన్నారు.
కలెక్టర్ విజయేందిర బోయి