ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తికాలేదు. మొత్తం 12.50 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 2015లో తొలుత రూ.35,200 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలోనే అంచనా వ్యయం రూ.52,056 కోట్లకు పెరిగింది. ప్రాజెక్టు కింద పంపుహౌస్‌లు, రిజర్వాయర్లు, టన్నెళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి కాగా.. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ చానళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అన్నిచోట్ల కీలకమైన మోటార్ల బిగింపు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మొదటి లిఫ్టు వద్ద ఒక్క మోటారును మాత్రమే ప్రారంభించారు. నార్లాపూర్ సమీపంలో మొదటి లిఫ్టు వద్ద రెండు మోటార్లు, ఏదుల సమీపంలో రెండో లిఫ్టు వద్ద నాలుగు మోటార్లు, వట్టెం సమీపంలో మూడో లిఫ్టు వద్ద నాలుగు మోటార్ల చొప్పున బిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
● రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక కొడంగల్– పేట ఎత్తిపోతల పథకానికి రూ.2,945 కోట్ల నిధులు మంజూరు చేశారు. పనులకు సంబంధించిన సర్వే మూడు దశల్లో పూర్తి కాగా.. ప్రాజెక్టు డీపీఆర్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది.
● కేఎల్‌ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించేందుకు కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం ఏడాదికి రూ.200 కోట్ల వరకు నిధులు అవసరం కానున్నాయి.