
రూ.1.05 కోట్లతో ప్రతిపాదనలు
జోగుళాంబ శక్తిపీఠం: అలంపూర్‌లోని అతి పురాతన యోగా నారసింహస్వామి, సూర్యనారాయణస్వామి ఆలయాల మరమ్మతుకు రాష్ట్ర పురావస్తుశాఖ రూ.1.05 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ఆలయాలపై దేవాదాయశాఖ దృష్టి సారించకపోవడంతో పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఆయా ఆలయాల్లో అప్పుడుప్పుడు దీపం పెట్టి తాళం వేస్తుంటారు. ఎలాగైనా వీటిని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఇటీవల పాలకమండలి ధర్మకర్త లొంక వెంకటనరసింహారెడ్డి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన నాలుగు నెలల కిందట ఆలయాలను పరిశీలించి రాష్ట్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్నాయని తెలుసుకొని అప్పటి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వానికి ఆలయాల లేఖ రాశారు. మూడు నెలల కిందట రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు రెండు ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తాత్కాలిక మరమ్మతులకు నివేదికలు సిద్ధం చేశారు.
యోగా నారసింహస్వామి ఆలయం..
ఈ ఆలయం లోతట్టు ప్రాంతంలో ఉండటంతో పునాదులు కనీసం 10 అడుగుల పెంచాలని నిర్ణయించారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండి పునాదులు శిథిలమవుతున్నాయని.. ఫ్లోరింగ్ తొలగించి కొత్తది వేయడం, అలాగే పైకప్పు దెబ్బతినడంతో మరమ్మతులు, టైల్స్ వేయడం, గోడలపై పేరుకుపోయిన సున్నపు మరకల తొలగింపునకు కెమికల్ క్లీనింగ్ చేయడం, నోటీసు, డైరెక్షన్, హిస్టరీ బోర్డుల ఏర్పాటు తదితర పనులకు రూ.75 లక్షలతో ప్రతిపాదనలు రూపొందించారు.
పనులు శాశ్వతంగా ఉండాలి..
ఆలయాలు ఆ చంద్ర తారార్కం ఉండాల్సినవి. కావున పనులు నాణ్యతగా చిరకాలం నిలిచేలా ఉండాలి. అరకొర నిధులతో పనులు చేయడం సరికాదు. మరోమారు ప్రతిపాదనలు తయారుచేయాలి.
– బండి శ్రీనివాసరావు. వ్యవస్థాపక అధ్యక్షుడు, జోగుళాంబ సేవాసమితి
అధికారుల దృష్టికి తీసుకెళ్తా..
ఆలయాల మరమ్మతులు చేయించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా భక్తుల అభిప్రాయాలను కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.
– పురేందర్‌కుమార్,
ఈఓ, అలంపూర్ ఆలయాలు
సూర్యనారాయణ స్వామి ఆలయం..
ఈ ఆలయంలో పురాతన పైకప్పు తొలగింపు, ఇటుక, బెల్లం, అలోవెరా, కరక్కాయ, కోడిగుడ్డు, సున్నం వంటి మిశ్రమంతో కొత్తగా పైకప్పు వేయడం, ఆలయ గోడల కెమికల్ క్లీనింగ్, పాత ఫ్లోరింగ్ తొలగించి గ్రానైట్ వేయడం తదితర పనులకు రూ.35 లక్షలతో ప్రతిపాదనలు రూపొందించారు.
అలంపూర్‌లోని యోగా నారసింహ,
సూర్యనారాయణస్వామి ఆలయాల
మరమ్మతుకు రాష్ట్ర పురావస్తుశాఖ సన్నద్ధం
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు
అరకొర నిధులతో..
రెండు ఆలయాల మరమ్మతుకు కేవలం రూ.కోటి ఎలా సరిపోతాయని ప్రజలు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి వేములవాడ, కొండగట్టు వంటి ఆలయలకు భారీగా నిధులు కేటాయిస్తూ. అలంపూర్ ఆలయాలపై సవతి ప్రేమ చూపడం సరికాదంటున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం కళాన్యాసం చేసి బాలాలయం నిర్మాణం చేసి అక్కడ నిత్య పూజలు చేయాల్సి ఉంటుందని.. వీటికే బోలెడు ఖర్చవుతుందని, ప్రతిపాదిత నిధులతో ఏం పనులు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పురావస్తుశాఖ తయారు చేసిన ప్రతిపాదనల్లో కనీసం ధ్వజస్తంభాన్ని కూడా ప్రస్తావించలేదని అంటున్నారు.

రూ.1.05 కోట్లతో ప్రతిపాదనలు

రూ.1.05 కోట్లతో ప్రతిపాదనలు

రూ.1.05 కోట్లతో ప్రతిపాదనలు