సర్పంచ్‌పై లైంగిక వేధింపుల కేసు | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌పై లైంగిక వేధింపుల కేసు

Nov 29 2026 1:34 PM | Updated on Nov 29 2026 1:34 PM

దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెళ్ల గ్రామ సర్పంచ్‌పై శనివారం లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ మహిళను సర్పంచ్‌ బొంకూరి రవియాదవ్‌ ఐదు నెలల నుంచి ఫోన్‌ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడు. అదే విధంగా పని నిమిత్తం జీపీ కార్యాలయానికి వెళ్లిన సదరు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా ఈ విషయం ఎవరికై నా చెబితే చంపుతానని బెదించాడు. బాధితురాలు భయపడి జరిగిన విషయం భర్తకు తెలిపింది. కాగా, శనివారం గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించే క్రమంలో కూడా సదరు మహిళను సర్పంచ్‌ బెదిరించాడు. ఈ విషయమై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సర్పంచ్‌ బొంకూరి రవి యాదవ్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

చేపల వేటకు వెళ్లి

యువకుడి మృతి

వెంకటాపురం(కె) : గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఓ యువకుడి మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం లక్ష్మీనగరంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఉయిక గోవింద్‌(32) శనివారం ఉదయం మరికల గ్రామ సమీపంలోని గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లాడు. కాగా, గాలానికి పెద్ద చేప చిక్కడంంతో దానిని బయటకు లాగే క్రమంలో ప్రమాదవశాత్తు నదిలో పడి మునిగిపోయాడు. ఎంతకూ గోవింద్‌ బయటకు రాకపోవడంతో సహ జాలర్లు గాలించి బయటకు తీశారు. అయితే అప్పటికే గోవింద్‌ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గర్భంలోనే శిశువు మృతి

● వైద్యులే ఆలస్యం చేశారని

బంధువుల ఆరోపణ

స్టేషన్‌ఘన్‌పూర్‌: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన గట్టు స్వప్న అనే గర్భిణి ప్రసవం కోసం శనివారం మధ్యాహ్నం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరగా సాయంత్రం వరకు పరిస్థితి విషమించింది. దీంతో బంధువులు ఆ మెను హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించగా అప్పటికే గర్భంలోనే శిశువు మృతి చెందింది. ఘన్‌పూర్‌ ఏరియా ఆస్పత్రిలోనే వైద్యులు ఆలస్యం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని ముందే హనుమకొండకు రెఫర్‌ చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయమై డీసీహెచ్‌ఎస్‌ సంధ్యను వివరణ కోరగా వివరాలు తెలిపారు. స్వప్న 39 వారాల పూర్తి గర్భధారణతో మధ్యాహ్నం ఘన్‌పూర్‌ ఏరియా ఆస్పత్రికి వచ్చిందన్నారు. విధుల్లో ఉన్న గైనకాలజిస్ట్‌.. గర్భిణిని పరీక్షించి తల్లి ఆరోగ్య పరిస్థితి, శిశువు గుండె స్పందన సాధారణంగా ఉన్నట్లు నిర్ధారించారన్నారు. తక్షణ వైద్యపర సమస్యలు ఏమి లేకపోవడంతో సాధారణ ప్రసవం కోసం వేచి ఉండాలని బంధువులకు సూచించారని చె ప్పారు. ఏమైనా సమస్యలు తలెత్తితే మెరుగైన వైద్యం కోసం హనుమకొండ ప్రభుత్వ ప్రసూ తి ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారని పేర్కొన్నారు. అయితే గర్భిణి బంధువులు సిజేరియన్‌ చేయాలని అడిగారని వివరించారు. సాధారణ ప్ర సవం కోసం వేచి చూద్దామని వైద్యులు చెప్పారన్నారు. ఈ క్రమంలో గర్భిణి, ఆమె బంధువులు డిశ్చార్జ్‌ ప్రక్రియ పూర్తి చేయకుండానే వైద్యుల సలహాలకు విరుద్ధంగా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement