గంజాయిపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

గంజాయిపై ఉక్కుపాదం

Nov 25 2026 3:42 AM | Updated on Nov 25 2026 3:42 AM

మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసు యంత్రాగం కఠిన చర్యలు చేపడుతోంది. గంజాయి అక్ర మ రవాణా, విక్రయాలు, నిల్వలు, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టింది. వాహన తనిఖీలు, ఆకస్మిక దాడులు, అనుమానితుల తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తోంది.

నెలలో 16 కేసులు.. 23 మంది అరెస్ట్‌

నెల రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద 16 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 34 మంది నిందితుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించగా, 23 మందిని అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.15,99,200 విలువైన 31.964 కిలోల ఎండు గంజాయితో పాటు ఒక గంజాయి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవా ణాకు ఉపయోగించిన రెండు వాహనాలను సీజ్‌ చేశారు.

వినియోగదారులపై ప్రత్యేక చర్యలు..

గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నెల రోజుల్లో గంజాయి వినియోగానికి సంబంధించి 8 కేసులు నమోదు చేసి, 13 మంది వినియోగదారుల ప్రమేయాన్ని గుర్తించారు. వీరిలో 9 మందిని అరెస్ట్‌ చేశారు. గంజాయి వినియోగానికి పాల్పడే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన వారికి వైద్య పరీక్షలు, డీ అడిక్షన్‌ చికిత్స అందించే దిశగా చర్యలు చేపడుతున్నారు.

ప్రత్యేక నంబర్‌..

జిల్లాలో ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వలు లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు వెంటనే 87126 56999 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి అక్రమ కార్యకలాపాలపై కచ్చితమైన సమాచారం అందించిన వారికి రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.

సరఫరా నెట్‌వర్క్‌పై ప్రత్యేక నిఘా..

గంజాయి విక్రయాలు, సరఫరాలో ప్రధానంగా పాల్గొంటున్న వ్యక్తులను గుర్తించడంతో పాటు, గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది.. ఎవరెవరికి విక్రయిస్తున్నారు.. అనే అంశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఎస్పీ అభినందనలు..

జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు సమర్థవంతంగా పనిచేస్తున్న సీసీఎస్‌ బృందంతో పాటు, విశ్వసనీయ సమాచారాన్ని సేకరించి, గంజాయి అక్రమ కార్యకలాపాలను గుర్తించి, నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన తొర్రూరు, మరిపెడ, బయ్యారం సీఐలు గణేష్‌, పవన్‌ కుమార్‌, రవీందర్‌, తొర్రూరు, దంతాలపల్లి, బయ్యారం, గార్ల, గూడూరు, కురవి ఎస్సైలు ఉపేందర్‌, రవికుమార్‌, ప్రశాంత్‌, సాయికుమర్‌, రమేష్‌ బాబు, సతీష్‌ను ఎస్పీ శబరీష్‌ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి నెట్‌వర్క్‌ను గుర్తించడంలో క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, నిరంతర నిఘా, సమన్వయంతో పనిచేసిన అధికారుల కృషిని ప్రశంసించారు. ఇదే అంకితభావంతో విధులు నిర్వహిస్తూ మానుకోటను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు.

నెల వ్యవధిలో 16 ఎన్‌డీపీఎస్‌ కేసులు నమోదు

23 మంది నిందితుల అరెస్ట్‌

31.964 కిలోల ఎండు గంజాయి, 2 వాహనాలు స్వాధీనం

గంజాయి కట్టడికి 87126 56999 ప్రత్యేక నంబర్‌

నెట్‌వర్క్‌ మూలాలను ఛేదిస్తున్నాం..

జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వ లు, వినియోగంపై ఏమాత్రం ఉపేక్షించేదిలేదు. గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోనే ఆగకుండా, దాని వెనుక ఉన్న ప్రధాన సరఫరాదారులు, ఆర్థిక మూలాలు, సరఫరా నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పదేపదే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తాం. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గంజాయి రహిత మహబూబాబాద్‌ జిల్లా నిర్మాణంలో ప్రజలు పోలీసులకు సహకరించాలి.

– శబరీష్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement