బీమాకు స్పందన అంతంతే! | - | Sakshi
Sakshi News home page

బీమాకు స్పందన అంతంతే!

Nov 25 2026 3:42 AM | Updated on Nov 25 2026 3:42 AM

మహబూబాబాద్‌: ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేస్తోంది. జిల్లా కేంద్రంలో ఈ నెల 19న పథకం ప్రారంభించినప్పటికీ.. సైట్‌ సమస్యతో ఈనెల 20నుంచి నమోదు చేస్తున్నారు. చాలామంది పాత రేషన్‌ కార్డు తీసుకెళ్తుండగా.. స్మార్ట్‌ రేషన్‌కార్డు లేదా ఆహార భద్రత కార్డు కావాలని చెప్పడంతో దాని కోసం తిరిగి ఇంటికి వెళ్లి తెస్తున్నారు. కాగా, ప్రచార వైఫల్యంతో పాటు అన్ని వార్డుల్లో నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో స్పందన అంతంత మాత్రంగానే ఉంది.

జిల్లా కేంద్రంలో ఆరు కేంద్రాలు..

జిల్లా కేంద్రంలో ముందుగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో 18వ వార్డు కోసం, తహసీల్దార్‌ కార్యాలయంలో 33వ వార్డుకోసం రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో, 11,16,31 వార్డుల్లో బీమా నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో వార్డు ఆఫీసర్లు, బిల్‌ కలెక్టర్లతో పాటు మున్సిపల్‌ సిబ్బందికి విధులు కేటాయించారు. మున్సిపల్‌ ఆర్‌ఐలకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు.

రెండు రోజుల్లో 400లోపు మాత్రమే..

మానుకోట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈనెల 20, 21వ తేదీల్లో 400మందిలోపు లబ్ధిదా రులు వివరాలు నమోదు చేసుకున్నారు. దీనిని బట్టి ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉందని అర్థం చేసుకోవచ్చు. కాగా, వార్డు ఆఫీసర్లు ఫోన్‌ చేసినా లబ్ధిదారులు స్పందించడం లేదు. అన్ని వార్డుల్లో నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రచారం చేశారు. ఆ తర్వాత కేవలం కొన్ని కేంద్రాలకే పరిమితమైంది. అన్ని వార్డుల లబ్ధిదారులు ఆయా కేంద్రాల్లో నమోదు చేసుకునే అవకాశం ఉంది.

రాని మెసేజ్‌లు..

కొన్ని కేంద్రాల్లో లబ్ధిదారుల పూర్తి వివరాలు, అడ్రస్‌ ఇతర అన్ని వివరాలు నమోదు చేసి ఆతర్వాత రిజిస్టర్‌లో సంతకం చేయికుంటున్నారు. కానీ, మొబైల్‌ఫోన్‌కు మెసేజ్‌ రావడం లేదు. రశీదు ఇవ్వడం లేదు. నమోదు అయినట్లా.. కానట్లా అని అడిగితే ఆసల్యమవుతుందని చెబుతున్నారని లబ్ధిదారులు అంటున్నారు.

రేషన్‌కార్డు లేకున్నా..

ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలలో రేషన్‌కార్డు లేకున్నా బీమా వర్తిస్తుంది.. నమోదు చేసుకోవాలని ఉంది. కానీ, నమోద్‌ కేంద్రాల్లో రేషన్‌ కార్డు (ఎఫ్‌ఎస్‌సీ, స్మార్ట్‌ రేషన్‌ కార్డు) లేకుంటే నమోదు చేయడం లేదు. నమోదుకు నెలరోజులే గడువు కావడంతో లబ్ధిదారులు పరేషాన్‌ అవుతున్నారు. అన్ని వార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి, విస్తృత ప్రచారం చేస్తేనే లబ్ధిదారులు నమోదుకు ఆసక్తి చూపుతారు.

ఇందిరమ్మ బీమాపై ప్రచార వైఫల్యమే కారణం

పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయని కేంద్రాలు

స్మార్ట్‌ రేషన్‌కార్డు లేదా ఎఫ్‌ఎస్‌సీ కార్డే కీలకం

రశీదు లేకపోవడం, మెసేజ్‌

రాకపోవడంతో పరేషాన్‌

కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి..

పథకం అమలుపై కలెక్టర్‌ స్నేహశబరీష్‌ ప్రత్యేక దృష్టి సారించారు. పథకం మార్గదర్శకాలు తదితర విషయాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. కాగా, ఈనెల 20న స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో నమోదు కేంద్రాన్ని పరిశీలించారు. కలెక్టర్‌ పథకం అమలుపై సీరియస్‌గా ఉన్నప్పటికీ.. ప్రచారం విషయంలో కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement