మహబూబాబాద్: స్మార్ట్‌రేషన్ కార్డులపై లబ్ధిదారులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు స్మార్ట్ కార్డు పంపిణీ ఉద్దేశం ఏమిటి, క్యూఆర్ కోడ్‌ఎలా పని చేస్తుందని లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పంపిణీ చేసిన పలు కార్డుల్లో పేర్లు ఇతర తప్పులు ఉన్నాయి. వాటి సవరణ ఉంటుందా అని.. ఇలా అనేక సందేహాలను లబ్ధిదారులు వ్యక్తపరుస్తున్నారు. పూర్తిస్థాయిలో గైడ్‌లెన్స్ రాలేదని సివిల్ సప్లయీస్ అధికారులు చెబుతున్నారు. కార్డుల పంపిణీలోనూ తీవ్ర జాప్యం చేస్తున్నారు.
558 రేషన్ షాపులు..
జిల్లాలో 18 మండలాల్లో 558 రేషన్‌షాపులు ఉన్నాయి. 2,79,039 రేషన్‌కార్డులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈపాస్ మిషన్‌ల ద్వారా ఐరిస్, బయోమెట్రిక్, ఓటీపీల ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆరు ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా రేషన్‌షాపులకు బియ్యం సరఫరా జరుగుతోంది. లబ్ధిదారుల సంఖ్యను బట్టి బియ్యం కోటా కేటాయిస్తున్నారు.
2,78,379 స్మార్ట్ కార్డులు..
జిల్లాలో 2,79,039 రేషన్‌కార్డులు ఉండగా 2,78,379 స్మార్ట్‌కార్డులు సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 15న పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కార్డుల పంపిణీ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన విషయం విదితయే. కాగా, కార్డులను తహసీల్దార్లకు అప్పగించగా.. వారు జీపీఓ, పంచాయతీ కార్యదర్శుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు.
పంపిణీలోనూ జాప్యం..
గ్రామాల్లో కార్డులు పంపిణీ చేపడుతుండగా... మున్సిపాలిటీల్లో తీవ్రజాప్యం జరుగుతోంది. మానుకోట మున్సిపాలిటీలో నక్షా ప్రాజెక్ట్ సర్వే జరుగుతుండడంతో స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం లేదు. మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా పంపిణీ ఆలస్యమవుతోంది. అయితే కార్డులను రేషన్ డీలర్లకు అప్పగిచంగా.. 90శాతం మందికి పంపిణీ చేయలేదు. సెప్టెంబర్ 1నుంచి పంపిణీ చేయనున్నట్లు చెబుతున్నారు.
చాలా కార్డుల్లో తప్పులు..
పంపిణీ చేసిన కార్డుల్లో చాలా వరకు తప్పులు ఉన్నాయి. ప్రధానంగా ఇంటిపేరు, యజమాని పేరు, అక్షరాలలో తప్పులు ఉన్నాయి. పిల్లల పేర్లు అప్‌డేట్ కాలేదు. ఇలాంటి సమస్యలతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సవరణ ఉంటుందా లేదా అనే సందేహాలతో ప్రజలు సతమతమవుతున్నారు.
సవరణ ఉంటుందా ?
స్మార్ట్ రేషన్ కార్డుల సవరణ ఉంటుందని, అయితే ఎలా చేయాలని అనే విషయాలపై స్పష్టత రాలేదని అధికారులు అంటున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఉంటుందని, తహసీల్దార్ కార్యాలయాల్లో కార్డుల్లో తప్పులు పరిశీలిస్తారని, వివరాలను ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుందని, అయితే ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు.
స్మార్డ్ రేషన్ కార్డులపై ఎన్నో సందేహాలు
తప్పుడు వివరాల ముద్రణతో
లబ్ధిదారుల పరేషాన్
కార్డు ఎలా పని చేస్తుందోనని ఆసక్తి
గైడ్‌లైన్స్ రాలేదంటున్న అధికారులు
జిల్లాలో మొత్తం రేషన్‌కార్డులు 2,79,039.. సరఫరా చేసినవి 2,78,379
పంపిణీలో తీవ్ర జాప్యం
మృతురాలి పేర స్మార్ట్ రేషన్ కార్డు..
కురవి: సీరోలు మండలం కొత్తూరు(సీ) గ్రామంలో చనిపోయిన వృద్ధురాలి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేసింది. గ్రామానికి చెందిన గుండె ఎల్లమ్మ ఈ ఏడాది ఫిబ్రవరి 4న మృతి చెందింది. కాగా, స్మార్ట్ రేషన్ కార్డు(ఫుడ్ సెక్యూరిటీ కార్డు)ను అధికారులు మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఎలాంటి గైడ్‌లైన్స్ రాలేదు
కొన్ని కార్డుల్లో తప్పులు ఉన్నాయి. సవరణ ఉంటుంది. లబ్ధిదారులు పరేషాన్ కావద్దు. పూర్తిస్థాయిలో కార్డు పని చేసే విధానంపై స్పష్టత రాలేదు. దీంతో మేము కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. గైడ్ లైన్స్ రాగానే వివరాలు తెలియజేస్తాం. కార్డుల పంపిణీ వేగవంతం చేస్తాం.
–రమేశ్, డీసీఎస్‌ఓ


