గాజరాంపల్లి గానకోకిల | - | Sakshi
Sakshi News home page

గాజరాంపల్లి గానకోకిల

Sep 1 2026 1:19 AM | Updated on Sep 1 2026 1:19 AM

పాటలు పాడడం అంటే ఇష్టం..

మహాముత్తారం: ‘ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌లో సింగిల్‌ సెషన్‌ గాయకుల ఎంపిక వేదిక అది. ఆర్కెస్ట్రాతో ఓ పాట పాడిన ఆమెను న్యాయనిర్ణేతలో ఒకరైన ప్రముఖ సినీ దర్శకుడు అనిల్‌ రావిపూడి జోక్యం చేసుకుని ఇదే పాటను ఆర్కెస్ట్రా లేకుండా పాడగలవా అని కోరతాడు.. ఆమె అదే బేస్‌ వాయిస్‌తో రేలారే..రేలారె.. నీళ్లల్ల నిప్పల్లె.. వచ్చింది నిజమల్లె’ అంటూ పాడడంతో ఆయనతోపాటు మరో జడ్జి, ప్రముఖ నేపథ్య గాయకురాలు శైలజ మంత్రముగ్ధులవుతారు. చప్పట్లతో హోరెత్తిస్తారు. ఇదే క్లిప్‌ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదవలేదు. సరైన ప్రోత్సాహం లభిస్తే పల్లె ముద్దుబిడ్డలు కూడా అద్భుతాలు సృష్టిస్తారని నిరూపిస్తోంది జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం గాజరాంపల్లి తండాకు చెందిన బంజారా బిడ్డ, గాయని అశ్విని రాథోడ్‌. నల్లబంగారం కొ లువైన నేలపై పుట్టిన ఆమె.. తన గానామృతంతో ఆ నేలకు, పుట్టిన ఊరికి ప్రత్యేక గుర్తింపు తెస్తోంది. చిన్నప్పటి నుంచే ఆమె సంగీతంపై ఆసక్తి పెంచుకుని తన మధుర గాత్రంతో పాటలు పాడుతోంది.

ఏడేళ్ల సంగీత ప్రయాణం..

అశ్విని ఏడేళ్లుగా నిరంతర సాధన చేస్తూ సంగీతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రారంభంలో గ్రామాల్లో జరిగే సాంస్కృతిక కా ర్యక్రమాల వేదికలపై పాటలు పాడుతూ ప్రేక్షకుల ను అలరించిన ఆమె క్రమంగా స్టూడియో రికార్డింగ్స్‌, సింగిల్‌ సెషన్స్‌ పాడే స్థాయికి ఎదిగింది. భావోద్వేగాలను పలికించే గాత్రం స్పష్టమైన ఉచ్ఛరణ ఆమె సొంతం.

సరిగమప వేదికపై ప్రతిభ

ఇటీవల ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సరిగమప సింగింగ్‌ రియాలిటీ షోలో అశ్విని పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎందరో గాయనీగాయకుల మధ్య పోటీపడి తన గాత్ర మాధుర్యంతో న్యాయనిర్ణేతలను మెప్పించారు. మారుమూల పల్లెటూరు నుంచి వెళ్లి అంతటి ప్రతిష్టాత్మక వేదికపై పాడి జిల్లా కీర్తిని దశదిశలా చాటారు.

ఇటీవల కాలంలో విడుదల అవుతున్న సింగిల్‌ ట్రాక్స్‌, స్టూడియో సెషన్స్‌లో తన గానంతో అశ్విని రాథోడ్‌ ప్రతిభ కనబరుస్తోంది. జానపద, భక్తి, సినీ గీతాలను సునాయాసంగా ఆలపిస్తూ సంగీత దర్శకుల మన్ననలు పొందుతోంది. మారుమూల తండా నుంచి వచ్చి ఎలాంటి పెద్ద సంగీత నేపథ్యం లేకపోయినా స్వయంకృషితోనే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎందరో గ్రామీణ కళాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది.

మరిన్ని అవకాశాలు రావాలి..

అశ్విని సంగీతంలో రాణిస్తుండడంతో గాజరాంపల్లి తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారుమూలతండా నుంచి వచ్చిన ఇలాంటి ప్రతిభావంతురాలికి ప్రభుత్వం, సినీ పరిశ్రమ మరిన్ని అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలని ప్రజలు, కళాభిమానులు కోరుతున్నారు.

నల్లసిరుల నేల బంజారా బిడ్డ

అశ్విని రాథోడ్‌

తండానుంచి సరిగమప వరకు

ఏడేళ్ల సాధన.. సింగిల్‌ సెషన్స్‌లో ప్రత్యేక ముద్ర

సింగిల్‌ సెషన్స్‌లో ప్రత్యేక ముద్ర

సంగీతమే నా ప్రాణం. చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే ఎంతో ఇష్టం. ఏడేళ్లుగా ఎన్నో అనుభవాలు, సవాళ్లను ఎదుర్కొంటూ పాటలే సర్వస్వంగా ముందుకుసాగుతున్నా. ప్రముఖ వేదికలపై పాడడంతోపాటు గొప్ప నేపథ్య గాయనిగా ఎదడగమే నా జీవిత ఆశయం. నాకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు

ధన్యవాదాలు.

– అశ్విని, గాయని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement