కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాలు, వర్సిటీ కాలేజీల్లో 16 పీరియడ్‌ల వర్క్‌లోడుతో పనిచేస్తున్న పార్ట్‌టైం అధ్యాపకుల ముఖ గుర్తింపు హాజరు నమోదు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధిత అధికారులు ఉపక్రమించగా తమకు ఈ విధానం వద్దంటూ కొందరు పార్ట్‌టైం అధ్యాపకులు సోమవారం పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు ఎఫ్‌ఆర్‌ఎస్ వద్దని, ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలను పెంపుదల చేసి ప్రతీ నెల చెల్లించాలని, పార్ట్‌టైం లెక్చరర్లను కాంట్రాక్టు లెక్చరర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించారు. పార్ట్‌టైం అధ్యాపకులకు ముఖగుర్తింపు హాజరు నమోదు ప్రక్రియకు సంబంధించి పరిపాలన భవనంలోని సెనెట్ హాల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను సోమవారం చేసుకోవాలని రిజిస్ట్రార్ రామచంద్రం ఇటీవల సర్క్యూలర్ జారీచేశారు. ఈ నేపథ్యంలో తమకు ముఖ గుర్తింపు హాజరు నమోదు విధానం అమలు వద్దంటూ పార్ట్‌టైం అధ్యాపకులు ఆందోళన చేపట్టగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగలేదు. ఆందోళన సమయంలో వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం హైదరాబాద్‌లో ఉన్నారు. రిజిస్ట్రార్ రామచంద్రం పార్ట్‌టైం అధ్యాపకులతో ఫోన్‌లో మాట్లాడారు. ముఖ గుర్తింపు హాజరు ప్రభుత్వ విధానమని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. బుధవారం వీసీ ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో అందుబాటులో ఉంటారని, తాను మంగళవారం అందుబాటులో ఉంటానని పార్ట్‌టైం అధ్యాపకులకు తెలిపారు. వీసీ వచ్చాక కలిసి చర్చించాలని సూచించారు. అనంతరం పార్ట్‌టైం అధ్యాపకులు కేయూ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌కు వినతిపత్రం సమర్పించారు.


