ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా జంపన్నవాగుకు చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం(బెల్లం), చీర సారె, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే దర్శనం అనంతరం భక్తులు మేడారం సమీపంలోని అటవీ ప్రాంతంలో వంటావార్పు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. నార్లాపూర్ ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు గద్దెల వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. కాగా మేడారం పరిసరాల్లో తాగునీటి సౌకర్యం అంతంతమాత్రంగానే ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.


