కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానం జీర్ణోద్దరణ, తొలగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ మహేశ్ ఆధ్వర్యంలో స్వామివారికి పూలు, పండ్లు సమర్పించి విశేష పూజలు చేశారు. శృంగేరి పీఠాధిపతి శ్రీవిధుశేఖరభారతి తీర్థస్వామి ఆశీస్సులతో వచ్చిన వేద పండితులు సందీప్‌శర్మ, రాధాకృష్ణశర్మ తొమ్మిది మంది బృందంతో క్రతువును వైభవోపేతంగా జరిపించారు. ముందుగా మహాగణపతి పూ జ చేసి, ప్రత్యేకంగా అనివెట్టి మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలలో పంచబ్రహ్మ హోమం, శాంతి పూజలు, ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. అనంతరం గర్భగుడిలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, కళాపకర్షణ క్రతువును ఉదయం 10:20 గంటలకు ప్రారంభించారు. తర్వాత విజయ గణపతి, పార్వతి దేవి (శుభానంద మాత), మహా సరస్వతిమాత, శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లోనూ పూజలు నిర్వహించి పంచలోహ బింబాల(కలశాలు)లో ప్రాణప్రతిష్ఠ చేపట్టారు. శృంగేరి శారదాపీఠాధిపతి స్వామివారు బాలాలయ పూజల కోసం పంపించిన కాళేశ్వరముక్తీశ్వర స్వామివారి చిన్న లింగాల(నర్మదా రాయి)కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ లింగాలను దేవస్థానానికి అందజేశారు.
బాలాలయంలోకి..
మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ చేసిన కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అడవిలోని శ్రీఆదిముక్తీశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బాలాలయ మండపంలో శృంగేరి శిష్యబృందంతో ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. బాలాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్తి కర్రతో చేసిన విగ్రహాలను ఆసీనులు చేశారు. భక్తులు దర్శనాలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
కాళేశ్వరం దేవస్థానంలో పూజలు నిలిపివేత..
జీర్ణోద్దరణ, దేవస్థానం తొలగింపు ప్రక్రియ పనులు వేగవంతం కానుండడంతో ఆలయంలో బుధవారం మధ్యాహ్నం నుంచి పూజలు నిలిపి వేశారు. ప్రధాన దేవస్థానానికి కిలోమీటరు దూరంలోని శ్రీఆదిముక్తీశ్వరాయం వద్ద బాలాలయంలో భక్తులు దర్శనాలు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆలయాన్ని మూసివేశారు. పూజలో దేవస్థానం అర్చకులు వెల్ది శరత్‌చంద్ర, రామకృష్ణ, పవన్‌శర్మ, రాముశర్మ, విజయ్‌శర్మ, రాజ్‌కుమార్‌శర్మ, శ్రావణ్‌శర్మ, రాధకృష్ణశర్మ పాల్గొన్నారు. దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్ శర్మ, ధర్మకర్తలు శ్యాం, సత్తయ్య, శ్రీధర్‌రావు, సీతయ్య, సీతారాం, దుర్గయ్య, పద్మ, తదితరులు పాల్గొన్నారు. కాగా, శృంగేరి శిష్యబృందం ఆలయ నిర్వాహకులను సన్మానించి ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఉదయం 5 నుంచి 11 గంటల వరకు ప్రత్యేక పూజలు
అడవిలోని ఆదిముక్తీశ్వరాలయం వద్ద దర్శనాలు
కాళేశ్వరం దేవస్థానంలో పూజలు నిలిపివేత


