క్రీడా పాఠశాల నిర్వహణకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

క్రీడా పాఠశాల నిర్వహణకు ఏర్పాట్లు

Jun 18 2026 1:05 AM | Updated on Jun 18 2026 1:05 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌ : ‘సాక్షి’లో ఈ నెల 15వ తేదీన ప్రచురితమైన ‘క్రీడా పాఠశాల.. నిర్వహణ ఎలా?’ అనే కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. హనుమకొండ కలెక్టర్‌ ఆదేశాలతో అదనపు కలెక్టర్‌ రవి బుధవారం హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోని క్రీడా పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన 80 మంది విద్యార్థులకు తగిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌ను ఆదేశించారు. విద్యార్థులకు అదనపు గదుల కోసం ఇప్పటికే స్టేడియంలో క్రీడా సంఘాల ఆధీనంలో ఉన్న గదులను ఖాళీ చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పోర్ట్స్‌ స్కూల్‌కు ఎంపికయ్యే విద్యార్థులు శిక్షణతో పాటు విద్యను కూడా ఒకే ప్రాంగణంలో పొందేలా స్టేడియం లోపలే పాఠశాల, హాస్టల్‌, భోజనశాల తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం స్టేడియంలోని గదులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌, భద్రత తదితర అంశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌ రవి.. స్కూల్‌ ప్రారంభానికి అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ స్పోర్ట్స్‌ స్కూల్‌ ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, విద్య, వసతి ఒకేచోట అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.

స్పోర్ట్స్‌స్కూల్‌ను పరిశీలించిన

అదనపు కలెక్టర్‌ రవి

క్రీడా సంఘాల ఆధీనంలోని గదులు ఖాళీ చేయాలని ఆదేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement