వన మహోత్సవానికి వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

వన మహోత్సవానికి వేళాయె..

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

మహబూబాబాద్‌: వన మహోత్సవానికి సిద్ధం కావాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ పిలుపునిచ్చారు. యాక్షన్‌ప్లాన్‌తో ముందుకెళ్లి విజయవంతం చేయాలని ఆదేశించారు. అయితే నర్సరీల్లో మాత్రం మొక్కలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముందస్తు ప్లాన్‌ లేకపోవడంతో సరిపడా మొక్కలు లేవు. నర్సరీల నిర్వహణ కూడా అధ్వానంగా మారింది. ప్రత్యేకంగా నిధులు విడుదల కాకపోవడంతో మొక్కల సంఖ్య పెంచలేదు.

మానుకోట మున్సిపాలిటీలో

మూడు నర్సరీలు..

మానుకోట మున్సిపాలిటీ పరిధి కురవి రోడ్డులో ని గ్రీన్‌ల్యాండ్‌లో ఒక నర్సరీ, గాంధీపురం శివారులోని రెండెకరాల ప్రభుత్వ భూమిలో ఒక నర్సరీ, రామచంద్రాపురం కాలనీ గ్రీన్‌ల్యాండ్‌లో మరో నర్సరీ ఏర్పాటు చేశారు. అయితే, కురవి రోడ్డులోని నర్సరీలో మాత్రమే మొక్కలు ఉన్నాయి. దానిలో కూడా 6,000 మొక్కలు మాత్రమే ఉన్నాయి. 10,000 విత్తనాలు నాటారు. అవి ఆగస్టులో మొక్కలు వస్తాయి. మానుకోట, నెల్లికుదురు ఎంపీడీఓ కార్యాలయాల నుంచి పదివేల మొక్కల చొప్పున తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

51 పట్టణ ప్రకృతి వనాలు..

ప్రభుత్వ భూములైన గ్రీన్‌ ల్యాండ్‌ల పరిరక్షణలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో 51 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి సుమారు 2,40,000 మొక్కలు నాటారు. వాటితో పాటు ఏడు పార్క్‌లు, 9 ఓపె న్‌ జిమ్‌లు ఏర్పాటు చేసి వాటి ఆవరణలో కూడా మొక్కలు నాటారు. అయితే నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. ప్రధానంగా పట్టణ ప్రకృతి వనాలు మరి దారుణంగా మారాయి.

గ్రీన్‌ బృందం..

నర్సరీలు, పార్కుల్లో మొక్కల సంరక్షణ కోసం గ్రీన్‌ టీం ఏర్పాటు చేశారు. ఆ టీంలో 21మంది ఉన్నా రు. అందులో ఏడుగురు డ్రైవర్లు ఉండగా.. ఒక్కొక్కరికి నెలకు రూ.12,000 వేతనం గ్రీన్‌ బడ్జెట్‌ నుంచి ఇస్తున్నారు. ఆరు ట్యాంకర్లు ఉన్నాయి. వాటిని నర్సరీలు, 5కిలోమీటర్ల మేర డివైడర్లలో మొక్కలకు నీళ్లు పోయడానికి ఉపయోగిస్తున్నారు.

కలెక్టర్‌ సమీక్ష సమావేశం..

ఈనెల 15న కలెక్టరేట్‌ అధికారులతో కలెక్టర్‌ స్నేహశబరీష్‌ వన మహోత్సవంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 18నుంచి వన మహోత్సవం ప్రారంభించాలని, యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకు పోవాలని ఆదేశించారు. అయితే సరిపడా మొక్కలు లేకపోవడం ఆందోళనక కలిగించే అంశం.

గ్రామీణ ప్రాంతాల్లో మంకీ ఫుడ్‌ కోర్టులు..

వన మహోత్సవంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మంకీ ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో కోతుల సమస్య తీరుతుంది. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అధికారులు చెబుతున్నా, రైతులు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణం కోతుల సమస్య. ఫుడ్‌ కోర్టులో పండ్ల మొక్కలు ప్రధానంగా కోతుల తినే మొక్కలు నాటి, అవి పెరిగిన తర్వాత వాటిలోకి కోతులను వదిలేస్తారు.

నేటినుంచి కార్యక్రమం ప్రారంభం

యాక్షన్‌ప్లాన్‌తో ముందుకెళ్లాలని ఆదేశాలు

గ్రామీణ ప్రాంతాల్లో మంకీ ఫుడ్‌ కోర్టులు

మానుకోట మున్సిపాలిటీలో అందుబాటులో 6,000 మొక్కలే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement