మరిపెడ రూరల్: మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన పర్వతారోహకుడు భూక్య యశ్వంత్‌నాయక్ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి గుగులోతు రవిని బుధవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా ఆయన మెమోంటో అందంచి శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవలి పర్వతారోహణ యాత్ర విశేషాలు, సాధించిన విజయాలను ఆయనకు వివరించాడు. యశ్వంత్ నాయక్ సాధించిన విజయాన్ని గుగులోత్ రవి అభినందిస్తూ, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువతకు ఆదర్శంగా నిలుస్తు సాహస క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు.
నేటి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ నుంచి కురవి మీదుగా ముల్కలపల్లి–ఖమ్మం రూట్‌లో నేటి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని డిపో మేనేజర్ వి.కల్యాణి బుధవారం తెలిపారు. మహబూబాబాద్–ఖమ్మం రూట్‌లోని ముల్కలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగా ఆర్టీసీ బస్సు సర్వీసులు మహబూబాబాద్–ముల్కలపల్లి–ఖమ్మంకు నడవనున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులు, పరిసర ప్రాంత ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విద్యార్థుల కోసం హెచ్‌ఎం ఎదురుచూపు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెం తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులు హాజరుకాలేదు. దీంతో హెచ్‌ఎం బోడ రాంజీ విద్యార్థుల కోసం తరగతి గదిలో నిరీక్షిస్తూ కూర్చున్నారు. కొంతమంది విద్యార్థులు ఇప్పటి వరకు పాఠశాలకు హాజరుకాకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యను అభ్యసించాలని, తల్లి దండ్రులు కూడా పిల్లలను ప్రతిరోజూ పాఠశాలకు పంపేలా సహకరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని, పిల్లలు పూర్తి స్థాయిలో పాఠశాలలకు హాజరుకావాలని పాఠశాల హెచ్‌ఎం పేర్కొన్నారు.
డీఏఓను కలిసిన సీఐపీఎంసీ అధికారులు
మహబూబాబాద్ రూరల్ : హైదరాబాద్‌లోని సీఐపీఎంసీ అధికారులు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.విజయచంద్రను డీఏఓ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలి శారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించిన ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమం, మట్టిపరీక్ష, పంటమార్పిడి చేసి రసాయన ఎరువులు తగ్గించి భూసారాన్ని కాపాడే అంశాలు, విత్తన శుద్ధి ఉపయోగాలు, పురుగు మందుల పిచికారీ, రైతులు రసాయన ఎరువులు తగ్గించి భూసారాన్ని కాపాడే జనుము, జీలుగ సాగుపై చర్చించారు. సీఐపీఎంసీ ఇన్‌చార్జ్ వెంకటరెడ్డి, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హొన్నప్ప, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉదయశంకర్, బయ్యారం ఏఓ కె.రాజు పాల్గొన్నారు.


