నయీంనగర్: హనుమకొండ హనుమాన్‌నగర్‌కు చెందిన బాలుడు నిరంజన్ చికిత్స లేని జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతను చిన్నప్పటినుంచి హీరో పవన్ కల్యాణ్ వీరాభిమాని. ఒక్కసారైనా ఆయనను కలవాలనే నిరంజన్ కోరికను నెరవేర్చడానికి బుధవారం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హనుమకొండకు వస్తున్నారని స్థానిక జనసేన నాయకులు మంగళవారం తెలిపారు. కాగా, నిరంజన్ వయస్సు 17ఏళ్లు.. అయినా జన్యుపరమైన వ్యాధి కారణంగా పదేళ్ల బాలుడిగానే కనిపిస్తాడు. తండ్రి సాధారణ ప్లంబర్. ఆస్తులు అమ్మి నిరంజన్ వైద్యం కోసం రూ.40లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేదు. అతన్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. తనను చూసేందుకు అభిమాన హీరో వస్తుండడంతో నిరంజన్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కాగా, పవన్ పర్యటన భద్రతా ఏర్పాట్లను సీపీ సన్‌ప్రీత్ సింగ్ మంగళవారం రాత్రి పర్యవేక్షించారు.


