ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో తుపాకీ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు సోమవారం రాత్రి ఓ బెల్ట్ షాపు వద్దకు మద్యం సేవించడానికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ బెల్ట్ షాపు యజమానితోపాటు పలువురు గ్రామస్తులతో వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో మాటామాట పెరగడంతో యువకుడిపై స్థానికులు చేయి చేసుకున్నట్లు తెలిసింది. తగాదా పెరిగిపోతుండడంతో అక్కడి నుంచి పంపించారు. బయటకు వెళ్లిన సదరు యువకుడు తుపాకీ పట్టుకుని బెల్ట్ షాపు వద్దకు వచ్చి నిర్వాహకుడితోపాటు పలువురిని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. సమీపంలో ఉన్న కొంత మంది ఫొటోలు, వీడియోలు తీసి పోలీసు అధికారులకు పంపినట్లు తెలిసింది. దీంతో మంగళవారం సాయంత్రం వరకు వరంగల్, నర్సంపేట, ఖానాపురం మండలాలకు చెందిన పోలీసు అధికారులు యువకుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టినట్లు సమాచారం. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా వెతికినా ఆచూకీ లభించలేదు. అయినా రాత్రి వరకూ గాలింపు చేపట్టినట్లు తెలిసింది.


