అమావాస్యతో బడికిరాని విద్యార్థులు
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బడిగంట మోగింది. వేసవి సెలవులను ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపిన చిన్నారులు సోమవారం బడిబాట పట్టారు. ఇన్నిరోజులు బోసిపోయిన బడులు విద్యార్థుల రాకతో కళకళలాడాయి. అమావాస్య కావడంతో చాలామంది విద్యార్థులు పాఠశాలలకు హాజరుకాలేదు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు మాత్రమే హాజరయ్యారు.
– మహబూబాబాద్ అర్బన్
● విద్యార్థులకు వినూత్నంగా స్వాగతం
● 32,231 మంది పిల్లలకు 4,119 మంది హాజరు
అమావాస్య ఎఫెక్ట్..
సోమవారం అమావాస్య కావడంతో విద్యార్థులు మొదటిరోజు బడికి రావడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. జిల్లాలో మొత్తం 32,231 మంది విద్యార్థులకు గాను 4,119 మంది మాత్రమే హాజరయ్యారు. కట్టెలమండి ప్రభత్వ పాఠశాల, సలార్‌తండా పాఠశాలలో విద్యార్థులు రాక ఉపాధ్యాయులు ఖాళీగా ఉండిపోయారు.
సమస్యల స్వాగతం..
ఈ విద్యా సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. చాలాచోట్ల తాగునీరు, విద్యుత్ అంతరాయం, మరుగుదొడ్లు, తరగతి గదుల్లో సమస్యలు యథా విధిగా దర్శనమిచ్చాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. కొన్ని పాఠశాలల్లో కిటికీలు లేక, ఫ్యాన్లు సరిగా తిరగకా విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలోని పలు తండాల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేని కొన్ని పాఠశాలలు తెరుచుకోలేదని విద్యార్థి సంఘాల నాయకులు తెలుపుతున్నారు. విద్యార్థులు ఎదురుచూసి తిరిగి ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు, హనుమంతునిగడ్డ, ప్రభుత్వ ప్రైమ రీ పాఠశాలల్లో డీఈఓ సత్యనారాయణమూర్తి, హెచ్‌ఎంలు రాంమోజీనాయక్, బాలాజీ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో ఎంఈఓ శీలం వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం ఆరుద్ర వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. డీఈఓ విద్యార్థులతో సెల్ఫీలు, ఫొటోలు దిగారు.
విద్యార్థుల ఇబ్బందులు.
పాఠశాలల పునఃప్రాంభం రోజు ఎండవేడి వల్ల ఉక్కపోతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా సమయానికి హాజరుకాలేదు. పాఠాలు బోధించలేదు. వచ్చిన విద్యార్థులు స్కూల్ ఆవరణలో ఆడుతూ పాడుతూ కనిపించారు.
●
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి
ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు సకాలంలో హాజరై పాఠశాలలను కొనసాగించి, విద్యార్థుల హాజరు శాతం పెంచాలి. అదేవిధంగా గైర్హాజరైన, పాఠశాలలు సమయానికి తీయని ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేవిధంగా నడుచుకోవాలి.
– సత్యనారాయణమూర్తి, డీఈఓ


