కేసముద్రం: మహిళాశక్తి భవనాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబా బాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. మండలంలోని మహముద్‌పట్నం గ్రామంలో రూ.10లక్షల నిధులతో చేపట్టనున్న మహిళాశక్తి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి, మాట్లాడారు. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అంబటి మహేందర్‌రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు అజ్మీరా సురేష్‌నాయక్, ఎంపీడీఓ క్రాంతి, ఎస్సై క్రాంతికిరణ్, సర్పంచ్ కట్ల ఎల్లయ్య, ఉపసర్పంచ్ ఏశబోయిన అమృత శ్రీనివాస్, పార్టీ గ్రామ అధ్యక్షుడు మిట్టగడుపుల యాకూబ్, కాసోజు యాకాంతాచారి తదితరులు పాల్గొన్నారు.
వర్షపు నీరు నిల్వకుండా చర్యలు
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ఆర్‌యూబీలో వర్షపు నీరు నిల్వకుండా తగు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రం శివారులోని బంధం చెరువు సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న బ్రిడ్జి డ్రెయినేజీని సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. డ్రెయినేజీలో చెత్త పేరుకుపోవడంతో నీరు కాల్వలో నిలిచి సమస్య తలెత్తిందన్నారు. రైల్వే పనులు చేసిన క్రమంలో కాల్వ పూడుకపోయి ఆర్‌యూబీలో వర్షపు నీరు నిలిచిందన్నారు. రైల్వే అఽధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీహరి పాల్గొన్నారు.
కేసముద్రం మార్కెట్ ఇన్‌చార్జ్ కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ ఇన్‌చార్జ్ కార్యదర్శిగా ఎన్.రాజేంద్రప్రసాద్‌ను నియమిస్తూ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రస్తుతం గ్రేడ్–3 సెక్రటరీగా కొనసాగుతున్న రాజేంద్రప్రసాద్‌కు మార్కెట్ ఇన్‌చార్జ్ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
తొర్రూరు సీడీపీఓగా రేష్మ
తొర్రూరు: తొర్రూరు ప్రాజెక్టు సీడీపీఓగా మంద రేష్మ నియమితులయ్యారు. ఈ మేరకు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట సీడీపీఓగా పని చేసిన ఆమె సాధారణ బదిలీల్లో భాగంగా తొర్రూరుకు వచ్చారు. ఇప్పటివరకు డిపప్యుటేషన్‌పై సీడీపీఓగా పని చేసిన కమలాదేవి సొంత స్థానం మహబూబాబాద్‌కు వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన నూతన సీడీపీఓకు సహచర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. అంగన్‌వాడీల బలోపేతం, మాతా, శిశు సంరక్షణకు పాటుపడతానని రేష్మ తెలిపారు.
రైతులకు అవగాహన కల్పించాలి
మహబూబాబాద్ రూరల్: యూరియా యాప్ ద్వారా మాత్రమే రైతులకు ఎరువుల బస్తాలు ఇవ్వాలని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి, ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సురేంద్రమోహన్ అన్నారు. హైదరాబాద్ వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి వారు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా యాప్ ద్వారా రైతులకు ఎరువుల సరఫరా విధానం అమలు తీరు, వివరాలను జిల్లా వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదిక కార్యాలయం నుంచి డీఏఓ ఎస్.విజయచంద్ర, డీసీఓ విజయకుమారి, ఏడీఏలు శ్రీనివాసరావు, శ్రీదేవి, టెక్నికల్ ఏడీఏ మురళి, ఏఓలు, ఏఈఓలు, సొసైటీల సీఈఓలు పాల్గొన్నారు.


