● రైల్వే గేట్ వద్ద వాహనదారుల ఇబ్బందులు
● గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి
● బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా రాకపోకలకు నిరాకరణ
డోర్నకల్: డోర్నకల్–గార్ల రోడ్డు మార్గంలో 90వ లెవల్ క్రాసింగ్ రైల్వేగేట్ వద్ద ప్రతీ రోజు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ, కాజీపేట రైలుమార్గంలో ప్రతీరోజు వందలాది రైళ్ల రాకపోకలు వల్ల రైల్వే గేట్ మూతబడి ఉండటంతో గంటల తరబడి వాహనదారులు నిరీక్షించాల్సి పరిస్థితి నెలకొంది. ఈమేరకు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ దానిపై నుంచి రాకపోకలకు అనుమతించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రాకపోకల్లో మరింత జాప్యం..
గార్ల–డోర్నకల్ మార్గంలో ప్రతీరోజు బస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలు ఇతర వాహనాల ద్వారా డోర్నకల్, గార్ల, ఖమ్మం, బయ్యారం, మహబూబాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు ఐదు వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. మరోవైపు రైల్వేమూడో లైన్ నిర్మాణం పూర్తి కావడంతో ఈ మార్గంలో నడిచే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండడంతో రాకపోకల్లో మరింత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి.
బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా..
డోర్నకల్, గార్ల మార్గంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని సుమారు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నాలుగేళ్ల క్రితం చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. రైల్వేశాఖ బ్రిడ్జి పైనుంచి రాకపోకలు కొనసాగించవచ్చని ఆర్ అండ్ బీ అధికారులకు మూడు నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నేటికీ బ్రిడ్జి మీదుగా రాకపోకలను అనుమతించకపోవడంపై గార్ల, డోర్నకల్ మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీరోజు రైళ్ల రాకపోకలతో రైల్వే గేటు మూసి ఉన్నప్పుడు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం చిన్న చిన్న పనులను పూర్తి చేయకుండా మూడు నెలలుగా ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్ అండ్ బీ అధికారులు మాట్లాడుతూ.. బ్రిడ్జిపై సుమారు కిలోమీటరు మేర డాంబర్ లేయర్ వేయాల్సి ఉందని, అనంతరం రోడ్డు మార్కింగ్ పనులు పూర్తి చేసి రాకపోకలకు అనుమతిస్తామని చెబుతున్నారు.
బ్రిడ్జిని ప్రారంభించాలి..
నిత్యం రైల్వే గేట్ మూతబడడంతో వాహనదారులతో పాటు ఇరు పక్కల భూములు ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్‌ను కలిసి బ్రిడ్జిని ప్రారంభించాలని కోరాం. పది రోజులలోపు పనులు పూర్తి చేసి బ్రిడ్జి మీదుగా రాకపోకలను అనుమతిస్తామని వారు హామీ ఇచ్చారు.
–బానోత్ రమేశ్, సర్పంచ్,
బుద్దారం, గార్ల మండలం


