మహబూబాబాద్ అర్బన్: రైతులు వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సంస్థ తమ సీఎస్‌ఆర్ నిధుల సహకారంతో రైతులకు ఉచితంగా వ్యవసాయ స్ప్రేయర్లను పంపిణీ చేసింది. హుస్సేన్ నాయక్ హాజరై మాట్లాడారు. రైతుల సాధికారత కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సంస్థ వ్యవసాయ స్ప్రేయర్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని, మహిళలకు కుట్టుమిషన్లు అందించి స్వయం ఉపాధికి ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ అధికారి వెంకన్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, గిరిజనశాఖ అధికారి దేశీరాంనాయక్, ఆర్డీఓ రాజేశ్వరీ, జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, నాయకులు ఎడ్ల అశోక్, ఒద్దిరాజు రామచంద్రరావు, శ్యామ్‌సుందర్‌శర్మ, మహేశ్, అశోక్‌కుమార్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.


