ఈ సంవత్సరం
80 మంది అడ్మిషన్లు..
సర్కారు జీఓ లేదు .. రూపాయి ఇచ్చిందీ లేదు
వరంగల్ స్పోర్ట్స్: ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు.. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి జిల్లాకు తీసుకొచ్చిన క్రీడా పాఠశాల ఒక్క ఏడాదిలోనే చతికిలబడే దుస్థితి నెలకొంది. భవిష్యత్ ప్రణాళిక లేమి, నిధుల కొరత, వసతుల కల్పన అంశాల పై దృష్టి కేంద్రీకరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో గతేడాది ఎంతో ఆర్భాంటంగా ప్రారంభమైన క్రీడా పాఠశాల రెండో విద్యా సంవత్సరాన్ని కొనసాగించేందుకు ప్రతికూల పరిస్థితులు వెంటాడుతున్నాయి. పాఠశాల నిర్వహణకు కావాల్సిన కనీస వసతుల కల్పన లోనూ పాలకులు, అధికారులు వ్యవహరించిన తీరు విద్యార్థులకు శాపంగా మారనుంది.తమ పిల్లలు చదువుతోపాటు ఆటల్లో తర్ఫీదు ఇచ్చే ప్రత్యేక క్రీడా పాఠశాలకు ఎంపికై నందుకు సంతోషించాలా..? అరకొర వసతుల నడుమ అవస్థలు పడుతారని తెలిసి ఆవేదన చెందాలో తెలియని పరిస్థితి తల్లిదండ్రుల వంతు అయింది. నేడు స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
నిధులు కేటాయించని ప్రభుత్వం..
హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియ ంలో తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన అధికారిక జీఓను ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం విశేషం. ప్రభుత్వం జీఓనే కాదు.. గత విద్యా సంవత్సరం నిర్వహించిన స్పోర్ట్స్ స్కూల్‌కు ఒక్క రూపాయి కూడా నిధులను మంజూరు చేయలేదు.
రూ.54 లక్షల నిధులు వెచ్చించిన డీఎస్‌ఏ..
హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ నిర్వహించేందుకు తరగతి గదులు, హాస్టల్ వసతులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాట్లను చేసింది. అందుకోసం సుమారు రూ.54 లక్షల నిధులను డీఎస్‌ఏ స్వయంగా వెచ్చించింది. ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తించారు.
పెండింగ్‌లో మెస్ బిల్లు..
స్పోర్ట్స్ స్కూల్ మొదటి సంవత్సరం నాలుగో తరగతితో ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 49 మంది బాలబాలికలు గత సంవత్సరం నాలుగో తరగతిని అభ్యసించారు. విద్యార్థులకు రూ.11.50 లక్షల మెస్ బిల్లులు ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో సదరు కాంట్రాక్టర్ బిల్లులు రాక అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. గత ఏడాది బిల్లులే ఇప్పటీకీ రాలేదు, కొత్తగా ప్రారంభం కానున్న విద్యా సంవత్సరానికి నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
స్పోర్ట్స్ స్కూల్‌కు చేరిన పాఠ్య పుస్తకాలు..
నిధులు, వసతుల మాట పక్కన పెడితే నాలుగు, ఐదు తరగతుల పాఠ్య పుస్తకాలు ఇప్పటికే స్పోర్ట్స్ స్కూల్‌కు చేరుకున్నాయి. పుస్తకాలను అందుకున్న విద్యార్థులకు తరగతిగదుల, హాస్టల్ ఏర్పాట్లు ఎప్పటికీ చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
కేవలం నాలుగో తరగతి మాత్రమే నిర్వహించిన డీఎస్‌ఏకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఈ విద్యా సంవత్సరం అదనంగా ఐదో తరగతిని కొనసాగించేందుకు అనుమతులు జారీ చేసింది. దీంతో గత విద్యా సంవత్సరం నాలుగో తరగతి చదివిన విద్యార్థులు 49 మంది ఐదో తరగతిలోకి అడుగుపెడుతుండగా.. కొత్తగా నాలుగో తరగతిలో అడ్మిషన్లు పొందిన 80 మంది విద్యార్థులను కేటాయించింది. ఈ విద్యా సంవత్సరం మొత్తం 129 మంది విద్యార్థులకు తరగతి గదులు, హాస్టల్ వసతిపై ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు.
గతేడాది డీఎస్‌ఏ నిధులతోనే నిర్వహణ
పాఠశాలకు అదనపు గదుల కొరత
నేడు ప్రారంభం కానున్న స్పోర్ట్స్ స్కూల్


