రెడ్‌క్రాస్‌కు 8 రాష్ట్రస్థాయి అవార్డులు | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌కు 8 రాష్ట్రస్థాయి అవార్డులు

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

హన్మకొండ అర్బన్‌: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హనుమకొండ రెడ్‌క్రాస్‌ 8 రాష్ట్రస్థాయి అవార్డులు, రక్తకేంద్రం మూడు అవార్డులను కై వసం చేసుకుంది. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా చేతుల మీదుగా కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌, జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ పి.విజయ్‌చందర్‌రెడ్డి, రాష్ట్ర పాలకమండలి సభ్యుడు వీవీ శ్రీనివాస్‌రావు అవార్డులు అందుకున్నారు. రక్తదాన ఉద్యమాన్ని ప్రోత్సహించడం, నాణ్యమైన రక్తసేవలు అందించడం, రక్త నిల్వలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా హనుమకొండ రెడ్‌క్రాస్‌ రక్తకేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ‘అత్యధిక రక్త సేకరణ చేసిన రక్తకేంద్రం’ విభాగంలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. అలాగే, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వహణలో విశేష కృషి చేసిన హనుమకొండకు చెందిన ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ, కిట్స్‌, వాగ్దేవి విద్యాసంస్థలకు అవార్డులు లభించాయి. విశిష్ట సేవల విభాగంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌, డఫోడిల్స్‌ స్కూల్‌కు గుర్తింపు లభించగా, అత్యధిక సార్లు స్వచ్ఛంద రక్తదానం చేసినందుకు జి.రామకృష్ణ, బి.శిరీష్‌కుమార్‌ రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్నారు. జిల్లాకు 8 రాష్ట్రస్థాయి అవార్డులు లభించడం గర్వకారణమని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. హనుమకొండ రెడ్‌క్రాస్‌ రక్తకేంద్రాన్ని త్వరలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement