● పెండింగ్‌లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు
● నిర్మాణాలు పూర్తయినా అందనివైనం
● మొదటి విడతలో 10,231మంజూరు.. 2,905 ఇళ్లు పూర్తి
● ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం జిల్లాలో వేగంగా సాగుతోంది. రాష్ట్రంలో జిల్లా ఆరో స్థానంలో ఉంది. కానీ, బిల్లుల చెల్లింపులో మాత్రం అధికారులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణాలు తుది దశకు వచ్చినా బిల్లులు రాకపోవడంతో పనులు నిలిచిపోతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇక పూర్తయిన ఇళ్లలో కూడా చాలా వరకు చివరి బిల్లులు రాకపోవడం గమనార్హం. మున్సిపాలిటీల పరిధిలో మాత్రం ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
మొదటి విడతలో
10,231 ఇళ్లు మంజూరు
జిల్లాలో 18 మండలాలు, ఐదు మున్సిపాలిటీలకు గాను ప్రభుత్వం 10,231 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించింది. కాగా, ఈనెల 8న అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం వాటిలో 8,937 మార్కింగ్ (ముగ్గు పోసుకుని ప్రారంభించారు) చేయగా 2,905 ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. డోర్నకల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు గాను 3,474 ఇళ్లకు 2,982 మార్కింగ్ చేయగా 1,275 పూర్తి చేశారు. మానుకోట నియోజకవర్గంలోని ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీలకు 3,522 ఇళ్లకు 3,052 మార్కింగ్ చేయగా 910 పూర్తి చేశారు. మానుకోట జిల్లా పరిధి ములుగు నియోజకవర్గంలోని రెండు మండలాలకు 1,043కు 948 మార్కింగ్ చేయగా.. 88 మాత్రమే పూర్తయ్యాయి. పాలకుర్తి నియోజకవర్గంలోని రెండు మండలాలు, మున్సిపాలిటీ 1,050కి 887 మార్కింగ్ చేయగా 341 పూర్తి చేశారు. ఇల్లందు నియోజకవర్గంలోని రెండు మండలాలకు 1,142 ఇళ్లకు గాను 1,068 మార్కింగ్ చేయగా.. 291 పూర్తి చేశారు.
అర్హతలు.. ఎంపిక ఇలా..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రజాపాలన పేరుతో దరఖాస్తుల స్వీకరించి ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి తదితర సంక్షేమ పథకాలకు అవకాశం కల్పించింది. దాని ప్రకారం నిరుపేదలు, స్థలం ఉండి ఇళ్లు లేని వారిని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. తర్వాత గెజిటెడ్, స్పెషల్ ఆఫీసర్‌ల విచారణ తర్వాత గ్రామాల్లో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషర్లు తుదిజాబితా రూపొందించి కలెక్టరేట్‌కు పంపించారు. బేస్‌మెంట్ వరకు రూ.లక్ష, గోడల నిర్మాణం పూర్తయితే మరో రూ.లక్ష, స్లాబ్‌కు ముందుగా రూ.రెండు లక్షలు చెప్పినా రూ.1,40,00 ఇచ్చారు. మిగిలిన 1,60,000 పూర్తి అయిన తర్వాత. అయితే ఇందుకు గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీలో అయితే వార్డు ఆఫీసర్ నిర్మాణ ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి ఆతర్వాత ఏఈ, డీఈ వద్ద ప్రాసెస్ అయిన తర్వాత లబ్ధిదారుల ఖాతాలో బిల్లులు జమచేస్తున్నారు. అయితే ఫొటోలు తీసే విషయంలో అధికారులు డబ్బులు అడుతున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో లబ్ధిదారుడే స్వయంగా యాప్‌లో అప్‌లోడ్ చేసే వెసులుబాటు కల్పించారు
రెండో విడతలో..
రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 ఇళ్లు మంజూరు చేశారు. అయితే ఈ విడతలో నియోజకవర్గంలో 2,000 ఇళ్లలో 500 ఇళ్లకు గోడలు ఉన్న వాటికి స్లాబ్ ఇతరత్రా నిర్మాణాలు చేసుకున్నా బిల్లులు ఇచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. కాగా ఈనెల 2న రాష్ట్ర అవతరణ వేడుకల్లో 12 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు సైతం అందచేశారు.
చెల్లింపుల్లో జాప్యం
డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెస్‌మెంట్, గోడల వరకు బిల్లులు సవ్యంగా వస్తున్నా.. తర్వాత ఆలస్యంగా వస్తున్నాయని వాపోతున్నారు. పనులు పూర్తయి రెండు నెలలు గడిచినా బిల్లులు రాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి విడతలో ఈనెల 8వ తేదీ వరకు రూ.221 కోట్లు లబ్ధిదారులు ఖాతాలో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.


