యూరియా వినియోగాన్ని తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

యూరియా వినియోగాన్ని తగ్గించాలి

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

డీఏఓ విజయచంద్ర

మహబూబాబాద్‌ రూరల్‌ : యూరియా వినియోగాన్ని తగ్గించి నానో యూరియా, నానో డీఏపీ వాడకాన్ని పెంచాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర రైతులకు సూచించారు. మహబూబాబాద్‌ పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో రైతులతో శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ విజయచంద్ర రైతులతో మాట్లాడుతూ అధిక మోతాదులో రసాయనిక ఎరువులను వాడటం వల్ల భూసారం లోపించి పంటల దిగుబడి తగ్గుతుందని తెలిపారు. జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలను వేసి భూమిలో కలియ దున్నటం ద్వారా భూసారం పెరిగి పంటల దిగుబడి వస్తుందన్నారు. రైతులకు యూరియా సరిపడా అందించడం జరుగుతుందని, ఫెర్టిలైజర్‌ యాప్‌ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకుని రైతులు కొనుగోలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి, సొసైటీ సీఈఓ కె.ప్రమోద్‌ కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

రోడ్లపై వ్యర్థాలు వేయొద్దు

మున్సిపల్‌ కమిషనర్‌ వినోద్‌కుమార్‌

మహబూబాబాద్‌: చికెన్‌షాపు యాజమానులు చికెన్‌ వ్యర్థాలను రహదారులు, కాల్వల్లో వేయొద్దని మున్సిపల్‌ కమిషనర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం చికెన్‌ షాపుల యాజమానులు, పందుల పెంపకందారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షాపుల వద్ద దుర్వాసన లేకుండా చూసుకోవాలన్నారు. ప్లాస్టిక్‌ కవర్లు నిషేధించి స్టీల్‌ బాక్స్‌లను ఉపయోగించేలా అవగాహన కల్పించాలన్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా తీసుకోవాలని, ఉన్నవారు రెన్యూవల్‌ చేసుకోవాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయని వాటిని పట్టణం నుంచి బయటికి తరలించాలన్నారు. కార్యక్రమంలో మేనేజర్‌ అంకుశావలి, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్‌, శ్రీహరి, పర్యావరణ అధికారి గుజ్జు క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు.

తొర్రూరు ఆర్టీసీ డీఎంగా ప్రసూనలక్ష్మి

తొర్రూరు: ఆర్టీసీ డీఎంగా కె.ప్రసూనలక్ష్మి నియమితులయ్యారు. డివిజన్‌ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. నర్సంపేట డీఎంగా పనిచేసిన ప్రసూనలక్ష్మి సాధారణ బదిలీల్లో భాగంగా తొర్రూరుకు వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ డీఎంగా పని చేసిన పద్మావతి. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి పీఓగా బదిలీపై వెళ్లారు.

వ్యవసాయ మార్కెట్‌ మూడు రోజులు బంద్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ మార్కెట్‌ మూడు రోజులు బంద్‌ ఉంటుందని ఏఎంసీ చైర్మన్‌ ఇస్లావత్‌ సుధాకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో వారంతపు సెలవులు, 15వ తేదీ సోమవారం అమావాస్య సందర్భంగా మార్కెట్‌ యార్డుకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీ మంగళవారం నుంచి మార్కెట్‌ యార్డులో క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయని, రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

ఇంటర్‌లో ప్రవేశాలకు స్పాట్‌ కౌన్సెలింగ్‌

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా రీజియన్‌లోని గిరిజన గురుకుల కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీ య సంవత్సరంలో ప్రవేశాలకు స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన శాఖ రీజినల్‌ కోఆర్డినేటర్‌ టి.రత్నకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన గిరిజన వి ద్యార్థులు ఈ నెల 16న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ ఎదుట గిరిజన గురుకుల కళాశాలలో ఉదయం 10 గంటలకు స్పాట్‌ కౌన్సెలింగ్‌కు హా జరుకావాలని తెలిపారు. పదో తరగతి మెమో, టీసీ, కులం, నివాసం, ఆదాయం ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, పాస్‌ ఫొటోలతో హాజరుకావాలని తెలిపారు. బాలుర కళాశాలలు దామరవంచ, మరిపెడ, మహబూబాబాద్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లు ఉన్నాయని, రెడ్యాల గురుకుల కళాశాలలో సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బాలికలకు కేసముద్రంలో సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement