తొర్రూరు: మున్సిపాలిటీలో ఇంటింటా చెత్త సేకరణ, డంపు యార్డుకు తరలింపు ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ సజావుగా సాగేందుకు పారిశుద్ధ్య విభాగం వాహనాలే ఆధారం. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా అధికారులు రూ.లక్షలు వెచ్చించి ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు కొనుగోలు చేస్తున్నారు. కానీ వాహనాలకు రిజిస్ట్రేషన్, బీమా చేయించడంపై మాత్రం శ్రద్ధ వహించడంలేదు. తొర్రూరు పట్టణంలో చెత్త సేకరణ, ఇతర వాహనాల వినియోగంలో మున్సిపాలిటీ అధికారులు రవాణాశాఖ నిబంధనలను గాలికొదిలేశారు. దీంతో బీమా లేని వాహనాలపై పని చేసేందుకు కార్మికులు భయపడుతున్నారు.
బీమా లేదు.. ధీమా లేదు..
గత ఆరేళ్ల కాలంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్ల విలువైన వాహనాలు కొనుగోలు చేశారు. కొనుగోలు ఎంత ముఖ్యమో.. రవాణాశాఖ నిబంధనలు పాటించడం అంతే ముఖ్యం. పెద్దగా చదువుకోని వారు సైతం వాహనాలకు రిజిస్ట్రేషన్, బీమా, కాలుష్య ధ్రువీకరణ తదితర ప్రక్రియలను పూర్తి చేస్తారు. రవాణా శాఖతోపాటు, పోలీసులు ఎడాపెడా జరిమానాలు విధించడంతోపాటు వాహనాలను సీజ్ చేయడం సాధారణం. కానీ తొర్రూరు మున్సిపాలిటీ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్, గుర్తింపు నంబర్లు ఉండవు. మున్సిపాలిటీలో ఆరు ఆటోలు, నాలుగు ట్రాక్టర్లు, జేసీబీ, డోజర్, వైకుంఠధామం వాహనాలున్నాయి. పాత వాహనాలకు కొనుగోలు పత్రాలు లేక రిజిస్ట్రేషన్, బీమా చేయించలేదు. కొత్తవాటిలో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం లేని వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఏడాదిన్నర క్రితం ఖరీదు చేసిన వాటికి పత్రాలున్నా పట్టింపు కరవైంది.
నిబంధనలు బేఖాతరు
వాహనం కొనుగోలు చేసే సమయంలో నెల రోజులకు ఉపయోగపడేలా తాత్కాలిక రిజిస్ట్రేషన్ గుర్తింపు కార్డు ఇస్తారు. అనంతరం శాశ్వత ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ చేసి గుర్తింపు నంబర్‌ను తీసుకుని బీమా చేయించాల్సి ఉంటుంది. గుర్తింపు, బీమా లేని వాహనాలు ప్రమాదానికి గురైతే బాధితులకు ఎలాంటి పరిహారం అందదు. వాహనాల బీమా, నిర్వహణ నిమిత్తం ఏటా బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నా వినియోగం జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొనుగోలు చేసిన 5 ఎలక్ట్రికల్ వాహనాలు మూలన పడ్డాయి. పనికిరానివి పాత సామాను కింద నిబంధనల మేరకు విక్రయించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు లేవు. తొర్రూరులో 58 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ప్రతీ రోజు 8 టన్నుల చెత్తను డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. చెత్త తరలింపు సమయాల్లో గత ఆరేళ్ల కాలంలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో అధికారులు స్పందించి వాహనాలకు రిజిస్ట్రేషన్, బీమా చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
మున్సిపల్ వాహనాలకు బీమా,
రిజిస్ట్రేషన్ కరువు
ప్రమాదాలు జరిగితే తప్పని ఇక్కట్లు
రూ.లక్షలు వెచ్చించి
బీమా మరుస్తున్న వైనం
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు


