● అదనపు కలెక్టర్ పురుషోత్తం
మహబూబాబాద్ రూరల్ : వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులకు సౌకర్యంగా సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ పురుషోత్తం అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించి మాట్లాడారు. పాఠశాలలోని తరగతి గదులను శుభ్రం చేయాలని, తాగునీటి ట్యాంకులో చెత్త చెదారం తొలగించి బ్లీచింగ్ చల్లాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలలకు వచ్చే సమయానికి ఎలాంటి సమస్యలు లేకుండా సంబంధిత గ్రామపంచాయతీల పాలకవర్గాలు, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థులు సాధించిన ఫలితాలతో రూపొందించిన కరపత్రాలను ఈసందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, సర్పంచ్ చీరిక వసంతఉపేందర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


