లింగాలఘణపురం: వారంతా స్నేహితులు. కారులో రెండు చోట్ల బంధువుల ఇళ్లలో జరిగిన శుభకార్యాలకు హాజరయ్యారు. అక్కడ ఆటాపాటలతో ఆనందంగా గడిపారు. వేడుకలు ముగిసిన అనంతరం సంతోషంగా ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో లారీ.. కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జనగామ– సూర్యాపేట రోడ్డుపై నవాబుపేట వద్ద చోటు చేసుకుంది. ఎస్సై శ్రవణ్‌కుమార్, మృతుల బంధువులు కథనం ప్రకారం.. కాజీపేటకు చెందిన ఇమ్రాన్ (28), సుభానీ (30), హనుమకొండ బొక్కలగడ్డకు చెందిన ఎండీ మాసిద్, సమీర్, ఖమ్మానికి చెందిన నూర్ స్నేహితులు. గురువారం ఉదయం సూర్యాపేట, మిర్యాలగూడలో జరిగిన శుభకార్యాలకు హాజరయ్యారు. వేడుకలు పూర్తయిన అనంతరం అదే రోజు రాత్రి కాజీపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గజ్వేల్ నుంచి ధాన్యం లోడ్‌తో సూర్యాపేట వైపునకు వెళ్తున్న లారీ నవాబుపేట వద్ద కారును ఢీకొంది. దీంతో సుభానీ అక్కడికక్కడే, కారు నడుపుతున్న ఇమ్రాన్ జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయాలైన మిగతా ముగ్గురు ఎండీ మాసిద్, సమీర్, నూర్‌ను జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఇమ్రాన్‌కు ఇటీవల నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. శుభకార్యాలకు వెళ్లి తిరిగొస్తూ ప్రమాదానికి గురై కనిపించని లోకాలకు చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రవణ్‌కుమార్ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని
పెద్దతూండ్లలో వృద్ధురాలు..
మల్హర్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పెద్దతూండ్లలో చోటు చేసుకుంది. కొయ్యూరు ఎస్సై మహేందర్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెంది నారా ముత్తమ్మ(75) కొన్ని సంవత్సరాలుగా కొయ్యూరు గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈనెల 11న రాత్రి సమయంలో కొయ్యూరు పాత పెట్రోల్ బంక్ ఎదుట గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతిరాలి బంధువు రామచంద్రు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
కారును ఢీకొన్న లారీ..
ఇద్దరు యువకుల దుర్మరణం
ముగ్గురికి తీవ్ర గాయాలు
నవాబుపేట వద్ద ఘటన


