విద్యుత్‌ సేవల్లో విప్లవాత్మక మార్పులు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సేవల్లో విప్లవాత్మక మార్పులు

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

● ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌

హన్మకొండ : ఆధునిక సాంకేతికతతో విద్యుత్‌ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, డైరెక్టర్లు, చీఫ్‌ ఇంజనీర్లు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లతో ఏ ర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సబ్‌స్టేషన్‌ పరిధిలో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటుతో ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ కష్టాలు తగ్గుతాయన్నారు. పట్టణాల్లో రింగులా గ్రామాల్లో కూడా విద్యుత్‌ సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే అంతరాయాలు నివారించొచ్చన్నారు. అంతకు ముందు ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్‌లో సమర్థవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదించిన పలు వినూత్న ప్రతిపాదనలను నవీన్‌ మిట్టల్‌కు వివరించారు.

ప్రకృతి వైపరీత్యాలకు సిద్ధంగా ఉండాలి..

ప్రకృతి వైఫరీత్యాలు, వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని సిబ్బంది మెటీరియల్‌తో సిద్ధంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం 18 సర్కిళ్ల సూపరింటెండెంట్‌ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులు పనిచేసే చోటే నివాసం ఉండాలన్నారు. ఈదురు గాలులకు స్తంభాలు కూలిపోయి, విద్యుత్‌ లైన్లు తెగిపోయి విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలన్నారు. డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.గిరిధర్‌రెడ్డి, టి.మధుసూదన్‌, ప్రభాకర్‌, డీఈలు తిరుమలరావు, రాజుచౌహాన్‌, అశోక్‌, మాధవరావు, వెంకటరమణ, అన్నపూర్ణ, నాగప్రసాద్‌, సీజీఎంలు రవీంద్రనాథ్‌, చరణ్‌దాస్‌, కిషన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement