బావిలో దూకి గర్భిణి ఆత్మహత్య
● కురవిలో ఘటన
కురవి: కుటుంబ కలహాలతో ఓ గర్భిణి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం రాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కాలనీ వాసుల కథనం ప్రకారం.. కురవికి చెందిన మండలి వెంకన్న, సాలమ్మ దంపతుల కూతురును అరుణ(19)ను ఏడాది క్రితం ఇదే గ్రామానికి చెందిన గుజ్జుల శ్రీను కుమారుడు మధుకి ఇచ్చి వివాహం చేశారు. ప్రస్తుతం అరుణ ఏడు నెలల గర్భిణి. అయితే దంపతులకు కొంతకాలంగా గొడవలు జరుగుతుండడంతో అరుణ తల్లిదండ్రుల ఇంటికి వచ్చి ఉంటుంది. బుధవారం అదే కాలనీలో ఉండే మృతురాలికి భర్త మధుకు గొడవ జరిగింది. ఇందులో మధు తన భార్య గాజులు పగులగొట్టి, పుస్తెల తాడు లాక్కుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అరుణ తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. అనంతరం అక్కడి నుంచి చెంచు కాలనీకి సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు పరుగులు పెడుతుండగా మునేశ్ అనే వ్యక్తి చూశాడు. బావిలో దూకిన అరుణను రక్షించేందుకు బావిలోకి దూకాడు. ఫలితం లేకపోవడంతో బావిపైకి చేరుకుని కాలనీకి వచ్చి విషయం తెలిపాడు. దీంతో కాలనీ వాసులు బావి వద్దకు వెళ్లి వెతుకుతూ పోలీసులకు సమాచారం అందించడంతో వారు బావి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్సై సతీశ్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికుల సాయంతో అరుణ మృతదేహాన్ని బయటకు తీశారు.
అప్పుల బాధతో వడ్డెగూడెంలోయువకుడు..
జఫర్‌గఢ్: అప్పుల బాధతో ఓ యువకుడు ఒంటిపై పె ట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండల కేంద్ర శివారు వడ్డెగూడెంలో చో టు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వడ్డెగూడేనికి చెందిన కుక్కల రాజేందర్ (32) రెండేళ్ల క్రితం ఇంటి నిర్మాణం కోసం ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ. 10 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఫైనాన్స్‌లో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ట్రాక్టర్ సరిగా నడవకపోవడంతో ఆ వాహనం కిస్తీతో పా టు హౌసింగ్ ప్రీమియం డబ్బులు నెలనెలా చెల్లించలేకపోయాడు. ఇదే విషయాన్ని కొద్ది నెలల నుంచి కుటుంబీకులకు చెబుతూ మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో ఈ నెల 12న రాత్రి తన భార్యకు వీడియో కాల్ చేసి అప్పులు చెల్లించకలేక ఇబ్బందులు పడుతున్నానని, ఇక నేను బతకనని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నానని ఫోన్ కట్ చేశాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు రాజేందర్ కోసం గాలించగా గ్రామ శివారు మాల్చగుట్ట సమీపాన కాలిన గాయాలతో స్పృహ తప్పి పడిపోయి కనిపించాడు. దీంతో వెంటనే 108లో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు.


