వరంగల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు

Mar 19 2026 8:27 AM | Updated on Mar 19 2026 8:27 AM

వరంగల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు

వరంగల్‌ లీగల్‌ : వరంగల్‌ జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ఆ మెయిల్‌ తమిళనాడునుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి పంపినట్లు గమనించారు. దీంతో ఒక్కసారిగా బెంబేలెత్తిన కక్షిదారులు, న్యాయవాదులు పరుగున కోర్టు హాల్‌ నుంచి బయటికి వచ్చారు. జిల్లా జడ్జి ఫిర్యాదుతో బాంబు, డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. గతంలో రెండు సార్లు ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ చేసి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కోర్టు సంబంధించి ప్రధాన ప్రవేశ మార్గాల్లో మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు.

అశ్రునయనాల మధ్య శ్వేత

అంత్యక్రియలు పూర్తి

కాజీపేట అర్బన్‌ : నిట్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె.లక్ష్మారెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కూతురు శ్వేత అంత్యక్రియలు బుధవారం నగరంలోని వికాస్‌నగర్‌లో అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. శ్వేత ఉన్నత చదువు కోసం అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లి అక్కడే భర్త సురేశ్‌రెడ్డి, ఇద్దరు పిల్లలతో ఉంటుంది. ఈ క్రమంలో ఈనెల 8వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, శ్వేత పార్థివదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేందుకు సమీప బంధువు కృష్ణారెడ్డి.. రాజ్యసభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి కేంద్రహోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. అమెరికాలోని భారత రాయబారి కార్యాలయ అధికారులను ఆదేశించడంతో శ్వేత మృతదేహాన్ని హనుమకొండ ఎన్జీఓస్‌ కాలనీలోని నివాసానికి తీసుకొచ్చారు. బుధవారం పద్మాక్షిగుట్ట సమీపంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

‘గివ్‌ పేపర్‌ బ్యాక్‌’ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

కాజీపేట అర్బన్‌: యూత్‌ ఫర్‌ సేవా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘గివ్‌ పేపర్‌ బ్యాక్‌’ ప్రోగ్రాం వాల్‌పోస్టర్‌ను నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ బుధవారం ఆవిష్కరించారు. కళాశాలలు, స్కూళ్లలో విద్యార్థుల వద్ద నుంచి వారి పాత నోట్‌ పుస్తకాలను సేకరించి రీసైకిల్‌ చేసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన పుస్తకాలను అందజేసే లక్ష్యం అభినందనీయమని నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ కొనియాడారు. కార్యక్రమంలో నిట్‌ ప్రొఫెసర్లు సంపత్‌రెడ్డి, బాలప్రకాశ్‌, కిరణ్‌ కుమార్‌, హెచ్‌ఎంలు భాస్కర్‌రెడ్డి, సతీశ్‌పాల్‌, యూత్‌ ఫర్‌ సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement