సమయం లేదు మిత్రమా.. | - | Sakshi
Sakshi News home page

సమయం లేదు మిత్రమా..

Feb 20 2026 6:35 AM | Updated on Feb 20 2026 6:35 AM

సమయం

సమయం లేదు మిత్రమా..

పదో తరగతి పరీక్షలకు 20రోజులు మాత్రమే..

వరుస ఎన్నికలతో అంతా అస్తవ్యస్తం

ముందుకు సాగని ప్రణాళికలు

సాక్షి, మహబూబాబాద్‌: పాఠశాలల పనితీరుకు పదో తరగతి ఫలితాలు కొలమానంగా భావిస్తారు. ఈమేరకు గత ఏడాది రాష్ట్రంలోనే మానుకోట జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించి మన్ననలు పొందింది. అయితే ఈ ఏడాది సరైన ప్రణాళిక లేదని, ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లు ఉందని విమర్శలు వస్తున్నాయి. వార్షిక పరీక్షలకు మరో ఇరువై రోజులే సమయం ఉండడంతో ఉత్తమ ఫలితాల సాధనకు అధికారుల నుంచి ఉపాధ్యాయుల వరకు బాధ్యత వహించాల్సి వస్తుంది. దీంతో వారందరిలోనూ టెన్షన్‌ మొదలైంది.

గత ఏడాది రాష్ట్రంలో టాప్‌..

2022–23 విద్యా సంవత్సరంలో జిల్లా విద్యార్థులు 85.54శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచారు. దీంతో ఫలితాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులుగా సబ్జెక్టు టీచర్లను మొదలుకొని హెచ్‌ఎంలు, జిల్లా విద్యాశాఖ అధికారుల వరకు సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. ఆతర్వాత సంవత్సరం కాస్త మెరుగు పడి రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచారు. అదే ఊపుతో గత విద్యా సంవత్సరం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఏఏఈఈఆర్‌టీ రూపొందించిన కరదీపికలతో పాటు, ప్రత్యేక పరీక్ష పత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహించారు. కేజీబీబీ, మోడల్‌ స్కూల్స్‌తోపాటు, పలు పాఠశాలల్లో చదువులో వెనకబడిన విద్యార్థులకు వరంగల్‌, హనుమకొండ నుంచి సిలబస్‌లో ప్రావీణ్యత గలిగిన అధ్యాపకులను పిలిపించి ప్రత్యేక తరగతులు చెప్పించారు. ఈమేరకు జిల్లా విద్యార్థులు 99.29 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో పాటు ప్రతిష్టాత్మక బాసర త్రిపుల్‌ఐటీలో జిల్లాకు చెందిన 175మంది విద్యార్థులు సీట్లు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటారు.

మొదలైన టెన్షన్‌..

మార్చి 14నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అటు విద్యార్థులకే కాకుండా ఇటు విద్యాశాఖ అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది. గత ఏడాది వంద రోజులకు ముందుగా స్లిప్‌ టెస్ట్‌లు పెట్టారు. ప్రత్యేక తరగతులు నిర్వహించారు. దసరా సెలవుల తర్వాత నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇందుకోసం దాతల సహకారం తీసుకొని విద్యార్థులకు అల్పాహారం పెట్టారు. డిసెంబర్‌లో సిలబస్‌ పూర్తి చేయడమే లక్ష్యంగా బోధన వేగవంతం చేశారు. కానీ ఈ ఏడాది ఆ టెంపో కనిపించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో వచ్చిన దక్షిణామూర్తి జిల్లా విద్యాశాఖలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా.. జిల్లానుంచి బదిలీపై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందారు. ఈక్రమంలో జిల్లాకు వచ్చేందుకు ఎవరూ సాహసం చేయలేఏదు. దీంతో ఏడీ రాజేశ్వర్‌కు డీఈఓ బాధ్యతలు అప్పగించారు. ఆయన చార్జ్‌ తీసుకోగానే పంచాయతీ ఎన్నికలు, ము న్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులు ఉండడంతో బోధనలో ఆటంకం కలిగిందని విద్యార్థులు చెబుతున్నారు. దీనికి తోడు పలు పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం లేదని, నిర్వహించినా.. మొక్కుబడిగానే ముందుకు సాగుతున్నాయని ఆరోపణలు ఉన్నా యి. ఇన్ని ఆరోపణల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు ఎలా నిర్వహిస్తారో.. ఫలితాలు ఎలా ఉంటాయో అనేది చర్చగా మారింది.

ఎక్కడా ఆటంకం కలగడంలేదు

పదో తరగతిలో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. ఎన్నికల నేపథ్యంలో కొంత ఇబ్బందులు కలిగిన విషయం వాస్తవమే అయినా అన్నింటిని సరిచేసుకుంటూ.. ముందుకు సాగుతున్నాం. మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నాం.

– రాజేశ్వర్‌, డీఈఓ

మూడేళ్లుగా పదో తరగతి ఫలితాల వివరాలు..

విద్యా సంవత్సరం పరీక్ష ఉత్తీర్ణులు శాతం రాష్ట్రంలో

రాసిన వారు స్థానం

2022–23 8,461 7,227 85.54 22

2023–24 8,178 7,738 94.62 12

2024–25 8,184 8,126 99.29 01

2025–26 8,832 – – –

సమయం లేదు మిత్రమా.. 1
1/1

సమయం లేదు మిత్రమా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement