అవగాహన అవసరమే
ప్రమాదానికి కారణమయ్యే
నిబంధనలు ఏవీ అతిక్రమించారంటే..
చలాన్లు సరే..
వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో 11,00,180 ఉల్లంఘనలు
సాక్షి, వరంగల్ : ‘ట్రాఫిక్ ఉల్లంఘనులపై చలాన్లు వేయడం కంటే వాహనదారుల్లో రోడ్డు ప్రమాదాలు, నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి.. అయినా మారకుంటే చలాన్లు విధించి ఆ మొత్తాన్ని వాహన యజమాని బ్యాంకు ఖాతాల నుంచే ఉపసంహరించుకునేలా చూడాలి.. దీనిపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టాలి’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో జరిగిన ‘ఎరైవ్ ఎలైవ్’ ప్రచార కార్యక్రమంలో అన్న మాటలివి. ఈ లెక్కన వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో విస్తరించి ఉన్న వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరముంది. కమిషనరేట్‌లో 230 మంది ట్రాఫిక్ సిబ్బంది ఉన్నా గతేడాది 281 ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు చేశారు. రవాణా శాఖ అధికారులు కేవలం రెండెంకెల సంఖ్యలోనే రోడ్డు భద్రతపై జాగృతి కల్పించారు. అయితే ఈ రెండు విభాగాలు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయడం ద్వారా ప్రమాదాలు నియంత్రించే అవకాశముంది. ఎక్కువ జనరద్దీ ఉండే ప్రాంతాలైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కూడళ్లు, కాలేజీలు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి. అదే సమయంలో గ్రేటర్ వరంగల్‌లోని ప్రధాన జంక్షన్లలో రోడ్డు ప్రమాదాల అంకెలను చూపిస్తూనే నిబంధనలు పాటిస్తే అందరూ భద్రంగా ఉంటారనే సూచనలను డిస్‌ప్లే బోర్డుల్లో ప్రదర్శించాలి. ఆ తర్వాతే విననివారిపై చలాన్లు వేయాలి. ఇలా ఓవైపు అవగాహన.. విననివారిపై చలాన్లతో భద్రత ప్రాధాన్యత తెలిపి రోడ్డు ప్రమాదాలు నియంత్రించి ప్రాణాలు నిలపొచ్చు.
రాయితీ లేనట్టే.. చెల్లించాల్సిందేనా
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చలాన్లు విధిస్తున్నారు. కానీ ఏడాది చివరల్లో రాయితీలు ప్రకటిస్తున్నారు. అప్పుడు చలానా సొమ్ములు చెల్లించొచ్చని వాహనదారులు భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇక చలాన్లపై రాయితీ ఉండకపోవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. 2025 నుంచి ఇప్పటి వరకు 11,00,180 ఉల్లంఘనల ద్వారా విధించిన రూ.30,61,96,920 జరిమానాను ఇక వసూలు చేయడంపై సిబ్బంది దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే, చలాన్లు విధించిన సమయంలోనే ఆటోమేటిక్‌గా వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచే నగదు ఉపసంహరణయ్యేలా చేయడం ద్వారా వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయొచ్చని ఓ పోలీసు అధికారి అన్నారు. ఇది అమల్లోకి వస్తే చాలామంది వాహనదారులు నిబంధనలు పాటిస్తారు. అదే సమయంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు పూర్తి స్థాయిలో తగ్గించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
రాంగ్ సైడ్ డ్రైవింగ్ 9,997, ఓవర్ స్పీడ్ 4,791, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 12,386, సిగ్నల్ జంప్ 13,024, ట్రిపుల్ రైడింగ్ 17,488, నో ఎంట్రీ 14,407, విత్‌ఔట్ సీట్‌బెల్ట్ 956, విత్‌ఔట్ హెల్మెట్ 9,04,287, డ్రంకెన్ డ్రైవ్ 35,513 కేసులు, 87,331 ఇతర కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదాలపై ముందు అవగాహన, వినకుంటే చలాన్లే..
సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ట్రాఫిక్
భద్రతపై విస్తృత చర్చ
2025 నుంచి ఇప్పటి వరకు రూ.30కోట్లకుపైగా జరిమానాలు
ట్రాఫిక్ విభాగం నిర్వహించింది
281 అవగాహన సదస్సులు
రవాణాశాఖ కూడా అంతంత
మాత్రంగానే భద్రతపై జాగృతి..


