మల్లన్న ఆలయంలో మహాసంప్రోక్షణ
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన మకర సంక్రాంతి జాతర ఉత్సవాలు శనివారం ముగిశాయి. పండితులు మహాసంప్రోక్షణ ఘనంగా నిర్వహించారు. ఉదయమే ఆలయ ఉప ప్రదాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో గర్భాలయాన్ని శుద్ధి చేయగా స్వామివారిని ఒగ్గు పూజారులు మేలు కొలిపారు. స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలు అలంకరించారు. అర్చకులు స్వామి వారి బండారి(పసుపు) నీటిలో కలిపి మామిడి ఆకును కలశంలో ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆలయ ఆవరణలోని భ్రమరాంబిక, ఎల్లమ్మ ఆలయం, అన్ని కార్యాలయాలను పవిత్ర జలంతో శుద్ధిచేశారు. మధ్యాహ్నం స్వామి లింగాకారానికి అన్నంతో అలంకరించి అన్నపూజ చేశారు. దీంతో మకర సంక్రాంతి నాలుగు రోజుల జాతర తొలి ఘట్టం ముగిసినట్లయ్యింది. భ్రమరాంభిక ఆలయ వార్షికోత్సవం, శివరాత్రి బ్రహ్మోత్సవాలు, శివరాత్రి రోజు పెద్దపట్నం, భ్రమరాంబిక అమ్మవారితో శివ కల్యాణం, ఉగాది ముందు వచ్చే ఆదివారం మరోసారి పెద్దపట్నం, బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మతో ప్రత్యేకంగా మల్లన్న కల్యాణం నిర్వహించనున్నారు. లక్షలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారని ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. అలాగే, ఉగాది వరకు ప్రతీ ఆది, బుధవారాల్లో స్వామి వారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటారని చెప్పారు.
ఉమామహేశ్వర ఆలయం నుంచి
స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ
జఫర్‌గఢ్ మండలంలోని కూనూరు ఉమామహేశ్వరస్వామి ఆలయం నుంచి ఆలయ చైర్మన్ నరహరి, అర్చకులు, సదాశివశర్మ, గ్రామ సర్పంచ్ దేవేంద్ర మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏటా ఆనవాయితీగా అందిస్తున్నట్లుగా మల్లికార్జునస్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేద పారాయణదారులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్ శర్మ, నందనం మధు, ఉప్పుల శ్రీనివాస్, పాతర్లపాటి నరేశ్‌శర్మ, మడికొండ దేవేందర్, ధర్మకర్తలు, ఆలయ ఉద్యోగ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఐనవోలులో ముగిసిన
మకర సంక్రాంతి జాతర


