వైభవంగా త్రిశూల స్నానం
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో అర్చకులు, ఈఓ కిషన్‌రావు, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు శనివారం త్రిశూల స్నానం నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, మండపపూజ, పూర్ణాహుతి, కలశ ఉద్యాపన, త్రిశూల స్నానం, హోమాలు, హారతి, మంత్రపుష్పం, బలిహరణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే, అష్టవ భైరవార్చన, నిత్యప్రాసన, రుద్రహోమం, శక్తిహోమం, మహాపూర్ణాహుతి జరిపారు. కుమ్మరి వంశీయులు స్వామి వారి పల్లేరం నిర్వహించారు. అనంతరం కోనేటిలో స్వామివారి త్రిశూల స్నానాన్ని అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య జరిపించారు. త్రిశూల స్నానం చేయడం వల్ల శరీర గుగ్మతలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఆలయ ప్రాంగణంలో కిక్కిరిసిన భక్తజనం
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయి కిటకిటలాడింది. స్వామి వారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. ఆలయ ప్రాంగణం వెలుపల సుమారు 200 మీటర్ల పొడవునా భక్తులు బారులుదీరారు. ఆదివారం తెల్లవారు జామున స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఆలయ ఈఓ కిషన్‌రావు, చైర్మన్ అశోక్ ముఖర్జీ, సీఐ పులి రమేశ్, ఎస్సైలు రాజు, దివ్య, అర్చకులు రాంబాబు, వినయ్‌శర్మ, రాజయ్య, వీరభద్రయ్య, సందీప్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
కొత్తకొండలో భద్రకాళి సమేత వీరభద్రుడికి పూజలు
అగ్నిగుండాలతో నేడు
ముగియనున్న బ్రహ్మోత్సవాలు


