భక్తులకు అందుబాటులో ఉండాలి
మేడారం జాతర ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి సీతక్క
ఎస్‌ఎస్‌తాడ్వాయి: రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మేడారం హరితహోటల్ ఆవరణలో శనివారం జాతర ఉత్సవ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో జిల్లా అభివృద్ధికి మంచి నిర్ణయాలను తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. జాతర ఉత్సవ కమిటీ డైరెక్టర్లు భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. మహిళలకు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో 14 మందితో నియమించిన కమిటీలో 13 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. సీఎం పర్యటనను ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పార్టీలకతీతంగా సర్పంచ్‌లు, మహిళలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం నూతన ఉత్సవ కమిటీ చైర్‌పర్సన్‌గా ఇర్ప సుకన్య, ఎక్స్ అఫీషియో మెంబర్‌గా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావుతోపాటు 12 మంది డైరెక్టర్లతో ఈఓ వీరస్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా మంత్రి సీతక్క కమిటీ చైర్‌పర్సన్‌తోపాటు డైరెక్టర్లను అమ్మవారి కండువాలు కప్పి సన్మానించి పూలమాలతో సత్కరించారు. అనంతరం మంత్రి సీతక్క, నాయకులు కలిసి చైర్‌పర్సన్ ఇర్ప సుకన్య, సునీల్ దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, జాతర మాజీ చైర్మన్ అర్రెం లచ్చుపటేల్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


