గుడిమెలిగె..ఆనందం కలిగె
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో సమ్మక్క పూజారులు బుధవారం గుడిమెలిగె పండుగ ఘనంగా నిర్వహించారు. ఉదయమే సమ్మక్క గుడిని శుద్ధి చేశారు. గుడిలోని అమ్మవారి శక్తి పీఠం గద్దెను మట్టితో అలికారు. సమ్మక్క పూజారి (వడ్డె) కొక్కెక కృష్ణయ్య అడవి నుంచి తీసుకొచ్చిన గడ్డిని గుడి ఈశాన్యం మూలన ఉంచారు. అనంతరం సమ్మక్క పూజారి సిద్ధబోయిన ముణిందర్ ఇంటి నుంచి పూజారులు, ఆడపడుచులు పసుపు, కుంకుమ తీసుకుని డోలువాయిద్యాలతో గుడికి చేరుకున్నారు. గుడిలో పూజారులు అలికి సిద్ధంగా ఉంచిన తల్లి శక్తి పీఠం గద్దైపె ముగ్గులు వేసి అలకరించారు. గుడి ఆవరణలో ధ్వజ స్తంభం, గుమ్మం వద్ద ముగ్గులు వేశారు. అనంతరం పూజారులు శక్తి పీఠం గద్దె వద్ద ధూపపాదీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. అమ్మవారికి యాటను నైవేద్యంగా సమర్పించారు. గుడిమెలిగె పండుగతో తొలిఘట్టం మహాజాతర పూజ కార్యక్రమాల తంతు మొదలైనట్లు పూజారులు తెలిపారు. కన్నెపల్లిలోని ఆలయంలో సారలమ్మ పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు మహేశ్, సిద్ధబోయిన స్వామి, వసంతరావు, పాపారావు, భోజరావు, జనార్ధన్, రానా రమేశ్, దూప వడ్డె నాగేశ్వర్‌రావు, దొబె బొక్కయ్య, తదితరులు పాల్గొన్నారు.
గట్టమ్మ తల్లికి శుద్ధి పండుగ..
ములుగు రూరల్: ఆదివాసీ నాయకపోడు గట్టమ్మ పూజారుల ఆధ్వర్యంలో గట్టమ్మ తల్లికి (గుడిమెలిగె) బుధవారం శుద్ధి పండుగ నిర్వహించారు. గట్టమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సదయ్య ఆధ్వర్యంలో పూజారులు, వారి కుటుంబ సభ్యులుతో కలిసి పూజలు నిర్వహించారు. అడవి నుంచి పాల పోరక తీసుకొచ్చి పందిరి వేశారు. పసుపు కుంకుమతో తల్లిని అలంకరించారు. నేటి నుంచి జాతర ప్రారంభమై సమ్మక్క, సారలమ్మ జాతరతో ముగుస్తుందని పుజారులు తెలిపారు. గట్టమ్మ ప్రధాన పూజారులు కొత్త లక్ష్మయ్య, అరిగెల సమ్మయ్య, ఆకుల మొగిలి, మోట్లపల్లి సరోజన, ఈర్పిరెడ్డి సారక్క, చిర్రా స్వరూప, ఆకుల రఘు, కొత్త రవి, నీలయ్య, సమ్మయ్య, అరిగెల సంజీవ, అచ్చరాజు, లక్ష్మణ్, మండపు అర్జయ్య, సురేశ్, రాజ్‌కుమార్, సారయ్య, స్రవంతి తదితరులు ఉన్నారు.
ఆదివాసీ సంప్రదాయంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
శక్తి పీఠం గద్దెను అలంకరించిన ఆడపడుచులు
నైవేద్యంగా యాట మొక్కు.. ధూపాదీపాలతో పూజలు
గుడిమెలిగె..ఆనందం కలిగె
గుడిమెలిగె..ఆనందం కలిగె


