అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
హసన్‌పర్తి : పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ముజ్‌పార గ్రామానికి చెందిన ఫెరోజ్ షేక్, సుక్‌చంద్, యామీన్ ముఠాగా ఏర్పడి సులువుగా డబ్బులు సంపాదించడానికి ప్రణాళిక రూపొందించారు. దీనికి చోరీలే మార్గమని భావించారు. అనుకున్నదే తడువుగా తాళాలు వేసి ఉన్న ఇళ్లలో పట్టపగలే చోరీలకు పాల్పడి ఆ సొత్తును అమ్ముకుని జల్సాలు చేస్తున్నారు. ఇలా పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రాల్లోని పలు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించగా రెండు నెలల క్రితం విడుదలయ్యారు. అనంతరం డిసెంబర్ 17న తెలంగాణకు చేరుకుని నగరంలోని కేయూ పరిధిలోని పరిమళ, సప్తగిరి కాలనీల్లోని రెండిళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మళ్లీ ఈనెల 10న గోపాలపురంలోని శివసాయి కాలనీలో చోరీలకు పాల్పడ్డారు. ఇక్కడ 15 తులాల బంగారం, 5తులాల వెండితో పాటు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, క్రైం డీసీపీ బాలస్వామి, క్రైం ఏసీపీ సదయ్య, హనుమకొండ ఇన్‌చార్జ్ ఏసీపీ ప్రశాంత్, కేయూసీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేపట్టారు. ఆ ముఠా మళ్లీ చోరీ చేయడానికి కేయూ జంక్షన్ వద్దకు వచ్చిందనే సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారికి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా నేరం అంగీకరించారు. దీంతో చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు.
● చోరీ సొత్తు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డీసీపీ కవిత


