మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
‘జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడికి టెలిగ్రామ్ లోకో సంస్థ పేరుతో పార్ట్ టైం ఉద్యోగానికి సంబంధించిన మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో ఉన్న లింకు ద్వారా ఖాతా సృష్టించి బ్యాంకు వివరాలు జత చేయమని సూచించగా ఆ విధంగా చేశాడు. అలా మూడు చోట్ల 20ప్రమోషన్లు పూర్తిచేస్తే లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తి తన పేరు మీద ఒక ఐడీ క్రియేట్ చేసి యూనియన్ బ్యాంక్ ఖాతా ద్వారా రూ.10,000 పంపించగానే అతడి ఖాతాకు రూ.800 పంపించారు. అది నిజమని నమ్మిన సదరు వ్యక్తి మళ్లీ రూ.7,000 పంపించగా రూ.2,500 వచ్చాయి. మళ్లీ రూ. 10,000లతో పాటు అవతలి వ్యక్తుల స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఖాతాకు లగ్జరీ ప్రమోషన్ పేరుతో అదనంగా రూ.1,3500 పంపించాడు. ఆ వెంటనే మరో బ్యాంకు ఖాతా నుంచి రూ.63,000 పంపించాడు. తాను పంపిన మొత్తం డబ్బులు రాకపోవడంతో పాటు మళ్లీ లగ్జరీ ప్రమోషన్ వచ్చిందని పేర్కొని రూ. 50లక్షలు పంపమని చెప్పగా.. వెంటనే తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు మొత్తంగా రూ.1.30లక్షలు నష్టపోయాడు.’
‘జిల్లా కేంద్రానికి చెందిన ఓ వృద్ధుడు ఫేస్‌బుక్‌లో పాత కాయిన్లు, నోట్లకు డబ్బులు వస్తాయని ఓ కంపెనీ పేరిట వచ్చిన ప్రకటను చూసి వారిని ఫోన్‌లో సంప్రదించాడు. తన వద్ద 10 రూపాయల పాత నోటు ఉందని చెప్పగా.. అవతల వ్యక్తులు రూ.22లక్షలు వస్తాయని చెప్పారు. అది నిజమని నమ్మిన సదరు వృద్ధుడు ప్రాసెసింగ్ ఫీజు కోసం తన ఫోన్ పే ద్వారా అవతలి వ్యక్తులకు రూ.750 పంపించాడు. ఆ విధంగా పలుమార్లు డబ్బులు పంపి ఆధార్ కార్డు వివరాలు కూడా తెలియజేశాడు. ఇలా అవతలి వ్యక్తులు పంపిన స్కానర్‌కు డబ్బులు పంపుతూ వచ్చాడు. 12 సార్లు మొత్తం రూ.20 లక్షలకు పైగా బదిలీ చేశాడు. అనంతరం అతడికి ఎలాంటి ఆర్థిక లాభం చేకూరకపోవడంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.’
‘జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళా ఫోన్‌కు రెండు నెలల క్రితం ప్రధానమంత్రి ముద్ర లోన్ వస్తుందని లింక్ వచ్చింది. వెంటనే సదరు మహిళ ఆ లింకుపై క్లిక్ చేసి అందులో తన వివరాలను నమోదు చేసింది. బ్యాంకు, పాన్‌కార్డు నంబర్లు అప్‌లోడ్ చేయమని చెప్పగానే.. ఆవిధంగానే చేసింది. ఆ వెంటనే రూ.10లక్షల ముద్రలోన్ వస్తుందని అవతలి వ్యక్తి నుంచి సమాధానం వచ్చింది. ప్రాసెసింగ్ ఫీజు కోసం తన నంబర్‌కు ఫోన్ పే చేయమని అవతలి వ్యక్తి చెప్పగా.. సదరు మహిళ తన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నుంచి రూ.15,900 పంపించింది. అనంతరం రూ.4985, మరోసారి రూ.9,999 పంపించింది. చెప్పినట్లు డబ్బులు పంపినా.. లోన్ రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్ పోర్టల్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. సదరు మహిళా మొత్తంగా రూ.30వేలకు పైగా నష్టపోయింది.’
మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026


