ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
మహబూబాబాద్ రూరల్: సంక్షేమ పథకాలు నేరుగా రైతులకు చేరాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకొచ్చింది. ప్రతీ రైతు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారి అవసరాల మేరకు ప్రభుత్వాలు సకాలంలో పథకాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈమేరకు రైతులందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
సగానికి తక్కువే..
జిల్లాలో 1,93,033 పట్టాదారు పాసు పుస్తకాలు ఉండగా 94,794 మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించాయి. 98,239 పట్టాదారు పాసు పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తూ సకాలంలో రైతులు తమ వివరాలు నమోదు చేయించుకోవా లని సూచిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ ఎందుకంటే..
● కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాలను సులభంగా పొందవచ్చు
● పీఎం కిసాన్ పథకానికి ఫార్మర్ ఐడీ తప్పనిసరి
● రైతు వివరాలు కచ్చితంగా నమోదు జరిగి పారదర్శకత పెరుగుతుంది
● బీమా, సబ్సిడీలు, రుణాలు, ప్రభుత్వ పథకాలు త్వరగా అందుతాయి
● ఒకే ఐడీతో లబ్ధి నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది
● భవిష్యత్ పథకాల ప్రయోజనాలు సులభం
● స్పష్టమైన గుర్తింపుతో మోసాలు తగ్గుతాయి
అవసరమైన పత్రాలు
● ఆధార్ కార్డు నంబర్
● భూమి పాస్ బుక్ వివరాలు
● ఆధార్ లింకై ఉన్న మొబైల్ నంబర్ తప్పనిసరిగా అవసరం
రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకోవాలి
● రైతులు తమ దగ్గరలోని మీ సేవ కేంద్రాల్లో రూ.15 మాత్రమే (అన్ని పన్నులు కలుపుకుని) చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
● రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ) ద్వారా కూడా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
ప్రస్తుతం రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి ఉన్న భూమి పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పొందాలంటే మాత్రం రైతుల తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోని రైతులకు సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత ఏఈఓల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. లేనిపక్షంలో మీసేవ కేంద్రాల ద్వారా కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. రైతుల మేలు కోసం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను రైతులందరూ చేయించుకోవాలి. భవిష్యత్ లో రైతుల కోసం అమలు చేయనున్న పథకాల అమలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారానే జరుగుతాయి.
– బి.సరిత, జిల్లా వ్యవసాయ అధికారి
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ప్రామాణికం
అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు
ప్రతీ రైతు నమోదుచేసుకోవాలని సూచన


