మార్వాడీ ఆడపడుచుల ఆత్మీయ కలయిక
మహబూబాబాద్ రూరల్ : మార్వాడీ సమాజ్ సభ్యులు వినూత్న కార్యక్రమానికి తెర తీశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచులను ఒకే చోట కలిపారు. ఫలితంగా 20 ఏళ్ల వయసు నుంచి 90 ఏళ్ల గల ఆడపడుచులు ఒకే చోట ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సమ్మేళనం రాష్ట్ర స్థాయిలో ఇదే ప్రథమమని నిర్వాహకులు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహేశ్వరి భవన్‌లో ఆదివారం ‘మార్వాడీ మానుకోట పరివార్ సమ్మేళన్.. బహెన్...భేటీయా’ పేరిట ఆడపడుచుల అపూర్వ ఆత్మీయ కలయిక నిర్వహించారు. దీనికి జిల్లా కేంద్రానికి చెందిన ఆడపడుచులు, వివాహాలు జరిగినవారు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడినవారు, విద్యనభ్యసించేవారు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు హాజరయ్యారు. ఇందులో భాగంగా దేశంలోని ఢిల్లీ, ముంబాయి, చైన్నె, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి 130 మంది వరకు వచ్చి సమ్మేళనంలో పాల్గొన్నారు. మహబూబాద్ జిల్లా కేంద్రానికి చెందిన 200 మందికిపైగా మార్వాడీ సమాజ్ సభ్యులతో కలిసి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, యోగ క్షేమాలు, బంధువుల ముచ్చట్లతో ఆనందంగా గడిపారు. మొదట ఉదయం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆడపడుచులకు ఘనంగా స్వాగతం పలికి జిల్లా కేంద్రంలో శోభాయాత్ర నిర్వహించి, మహేశ్వరి భవన్ వేదికగా సంబరాలు జరిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడలు, ఆధ్యాత్మిక, భక్తి గేయాల ఆలాపనలు నిర్వహించారు.
ఒకేచోట కలుసుకున్న 20 ఏళ్ల వయసు నుంచి 90 ఏళ్ల గల ఆడపడుచులు
తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఇదే ప్రథమం
మానుకోట జిల్లా కేంద్రంలో సందడి


