వరంగల్, హనుమకొండను ఒకే జిల్లాగా పునర్‌వ్యవస్థీకరించాలి
● నిరసన దీక్షలో
పౌర సంఘాల నేతల డిమాండ్
హన్మకొండ: వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే జిల్లాగా పునర్‌వ్యవస్థీకరించి అభివృద్ధి చేయాలని పలు పౌర సంఘాలు, ఆయా పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. రెండింటిని ఒకే జిల్లాగా ఏ ర్పాటు చేసి హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ మహానగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హనుమకొండలోని ఏకశిల పార్కు వద్ద తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో ఆయా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మద్దతు పలికి మా ట్లాడారు. పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అశాసీ్త్రయంగా విభజించిన హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా ప్రకటించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ‘కుడా’ చైర్మన్ వెంకటరామిరెడ్డి, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి (ఫోన్ ద్వారా సందేశం), మాజీ మేయర్ రాజేశ్వరరావు, సీపీఎం జిల్లా అధ్యక్షుడు జి.ప్రభాక ర్ రెడ్డి, నాయకుడు చుక్కయ్య, బీజేపీ నాయకుడు రావు అమరేందర్ రెడ్డి, న్యూ డెమోక్రసీ నాయకుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే జిల్లాగా ఏర్పాటు చేయడానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్‌మోహన్‌రావు, ఆయా సంఘాలు, పార్టీల నాయకులు సోమ రామమూర్తి, జిలుకర శ్రీనివాస్, సాయిని నరేందర్, బాబురావు, మల్లారెడ్డి, చాపర్తి కుమార్ గాడ్గే, సోమిడి శ్రీనివాస్ పాల్గొన్నారు.


