మేడారంలో ట్రాఫిక్ జామ్
తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన సీతక్క, ఎస్పీ
ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి/వెంకటాపురం(కె): ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో వేలాదిగా తరలిరావడంతో మేడారం–తాడ్వాయి మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి తోడు మేడారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు పర్యటించడంతో భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. మేడారం బస్టాండ్ సమీపంలో పోలీసులు ప్రైవేట్ వాహనాలను వీఐపీ పార్కింగ్ వైపునకు మళ్లించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. సుమారు 5 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామం నుంచి నార్లాపూర్ వరకు వాహనాలు నిలిచిపోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. జంపన్న వాగుకు చేరుకున్న వాహనాలను గద్దెల ప్రాంతానికి నేరుగా వెళ్లకుండా పలు ప్రాంతాల ద్వారా తరలించారు. అదేవిధంగా ములుగు గట్టమ్మ వద్ద భక్తుల సందడి నెలకొంది.
జంపన్న వాగు వద్ద చిన్నారితో పాటు మరొకరు తప్పిపోయారు. మంత్రి సీతక్క, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు ఆ చిన్నారిని అప్పగించారు.
మేడారంలో ట్రాఫిక్ జామ్


