అప్పుల బాధతో గొర్రెల వ్యాపారి..
నల్లబెల్లి : అప్పుల బాధతో ఓ గొర్రెల వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిండి కొమురయ్య (55) గేదెలు, గొర్రెల కాపరిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అవసరాలు పెరగడంతో కుటుంబ సభ్యులతో చర్చించి నాలుగేళ్ల క్రితం రూ.5 లక్షలు అప్పు చేసి గొర్రెల వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులకు వడ్డీలు చెల్లించడం ఇబ్బందిగా మారింది. దీంతో మరింత అప్పు చేశాడు. అప్పులు పెరగడంతో కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఇటీవల అప్పు చెల్లించాలని పలువురు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.


