‘బుగులోని’ జాతర ప్రారంభం..
రేగొండ: కార్తీక పౌర్ణమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులో ఏటా జరిగే బుగులోని వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమలగిరి గ్రామంలోని అర్చకుడు కూర్మచలం వెంకటేశ్వర్లు ఇంట్లో కొలువై ఉన్న స్వామి వారి ఉత్సవ విగ్రహలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంలో బుగులోని గుట్ట వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఇక్కడ ఉన్న ఇప్ప చెట్టు చుట్టూ రథం తిప్పారు. సాయంత్రం కల్యాణం నిర్వహించిన అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకీ సేవలో గుట్టపైకి చేర్చారు. కాగా, స్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ఈ నెల 8వతేదీ వరకు కొనసాగనున్నాయి.
కల్యాణానికి ప్రత్యేక రఽథం..
ప్రత్యేకంగా అలంకరించిన రథంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను డప్పుచప్పుళ్లు మధ్య జాతర ప్రాంగణానికి తరలించారు. ఊరేగింపుగా వెళ్తున్న స్వామి వారికి భక్తులు అడుగడుగునా మంగళహారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టి నీరాజనాలు పలికారు. సాయంత్రం గుట్ట కింద ఉన్న శివాలయం ప్రాంగణంలో అలివేలుమంగ, పద్మావతి అమ్మవార్లతో (విగ్రహాలు) స్వామి వారి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి రేగొండ, కొత్తపల్లిగోరి మండలాలతో పాటు పక్క మండలాల నుంచి భక్తులు భారీగా తరలొచ్చారు. అనంతరం సతీసమేతంగా స్వామి వారిని కొండ గుహలో వెలసిన ప్రాంతానికి చేర్చారు. స్వామి వారి రాకతో గుట్ట పై ఉన్న గండ దీపాన్ని వెలిగించారు. దీంతో ప్రకృతి రమణీయత ఉట్టిపడే గుట్టల్లో కార్తీక పౌర్ణమి కాంతులు వెలుగుతున్నాయి. పచ్చని ప్రకృతి, పౌర్ణమి కాంతులు, విద్యుత్ వెలుగుల నడుమ బుగులోని కొండలు దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులను అలరిస్తున్నాయి.
ప్రశాంతంగా నిర్వహించాలి..
బుగులోని జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించాలని అడిషనల్ ఎస్పీ నరేశ్ అన్నారు. మంగళవారం జాతర ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. జాతరకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఐలు కరుణాకర్ రావు, మల్లేశ్, ఎస్సైలు రాజేశ్, దివ్య, త్రిలోక్, సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా స్వామి వారి కల్యాణం


