రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి
హన్మకొండ అర్బన్: భారీ వర్షాలతో ధర్మసాగర్, వేలేరు మండలాల్లో జరిగిన నష్టంపై రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి అంచనాల నివేదిక ఇవ్వాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి రెండు మండలాల పరిస్థితిపై మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలన్నారు. వర్షాలతో ధాన్యం కొట్టుకుపోయిన వారికి పంట నష్టం కింద పరిహారం చెల్లించాలని, పశువులు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే సాయం అందించాలని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల తాత్కాలిక పునరుద్ధరణ పనులు వారం రోజుల్లో పూర్తిచేయాలని పీఆర్, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఉనికిచర్ల, రాపాకపల్లి రోడ్డు మరమ్మతులు, వేలేరు, కొత్తకొండ రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటి విడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సాగునీటి శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ తుపాను నష్టాలపై అంచనాలను త్వరగా అందజేయాలని, ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ మేన శ్రీను, అధికారులు పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హనుమకొండ కలెక్టరేట్‌లో
అధికారులతో సమీక్ష


