
స్టెరాయిడ్ విక్రయిస్తున్న జిమ్ ట్రైనర్ అరెస్ట్
రామన్నపేట : బాడీ బిల్డింగ్ పోటీల్లో గెలుపొందాలనే యువత కోరికను ఆసరా చేసుకుని వారికి అత్యంత ప్రమాదకర స్టెరాయిడ్ విక్రయిస్తున్న జిమ్ ట్రైనర్‌ను అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ తెలిపారు. ఈ మేరకు శుకవ్రారం రాత్రి మట్టెవాడ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్‌లోని డాక్టర్స్ కాలనీకి చెందిన కందకట్ల శ్రవణ్‌కుమార్ అలియాస్ కిరణ్ సుబేదారిలోని జేడీ జిమ్‌లో బాడీ బిల్డింగ్ శిక్షణ పొందుతున్నాడు. ఈ శిక్షణలో ప్రశాంత్ అనే వ్యక్తి పరిచయమై శరీర ఆకృతి త్వరగా రావాలంటే స్టెరాయిడ్ తీసుకోవాలని చెప్పి కొన్ని స్టెరాయిడ్ ఇంజక్షన్లు, టాబ్లెట్ల్ విక్రయించాడు. అప్పటి నుంచి శ్రవణ్ స్టెరాయిడ్ తీసుకుంటూ జిమ్ చేస్తున్నాడు. ఈ విధంగా ఐదు సంవత్సరాలుగా శ్రవణ్ స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఎలాంటి లైసెన్స్ లేకుండా వైజాగ్‌కు చెందిన మణికంఠ, ఆనంద్ వద్ద ఆన్‌లైన్ ద్వారా స్టెరాయిడ్ కొనుగోలు చేస్తూ యువతకు సైతం విక్రయిస్తున్నాడు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు శ్రవణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా యువతకు స్టెరాయిడ్ విక్రయిస్తూ అధిక మొత్తంలో డబ్బు సంపాదించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో శ్రవణ్‌ను అరెస్ట్ చేసిన అతడి వద్ద నుంచి సుమారు రూ.20 వేల విలువైన స్టెరాయిడ్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. శ్రవణ్‌కు స్టెరాయిడ్ విక్రయించిన మణికంఠ, ఆనంద్, ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ వివరించారు. కాగా, స్టెరాయిడ్‌తో బీపీ పెరిగి హాట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని, వీటి వినియోగంతో కాలక్రమేణ మానసిక సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయని ఏసీపీ పేర్కొన్నారు. మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపి, ఎస్సై విఠల్, తదితరులు పాల్గొన్నారు.
పరారీలో ముగ్గురు
వివరాలు వెల్లడించిన ఏసీపీ