ఎమ్మిగనూరురూరల్: కుమార్తె పెళ్లికి కొత్త దుస్తులు తీసుకొని వస్తూ తండ్రి ప్రభుదాస్(45), ఏరువాక పౌర్ణమి పండుగకు భార్య ఊరికి వెళ్తూ బోయ రవి (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బనవాసి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్వల్ప గాయాలతో ఉదయ్ అనే బాలుడు బయటపడ్డాడు.
కుమార్తె పెళ్లికి దుస్తులు తీసుకొని వస్తూ..
పెద్దకడుబూరు గ్రామానికి చెందిన ప్రభుదాస్(45)కు శిరీష, రాణి, కీర్తన, ఉదయ్‌లు సంతానం. భార్య కొన్ని సంవత్సరాల కిత్రం భర్తను వదలి వెళ్లిపోయింది. రెండో కుమార్తె రాణికి జూలై 1,2 వ తేదీల్లో జాలమంచి గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చియం అయింది. కుమార్తె పెళ్లి కోసం ఎమ్మిగనూరుకు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి కొత్త దుస్తులు కొనుగోలు చేశారు. కుటుంబ సభ్యులను ఆటోలో పంపి ప్రభుదాస్(45), కుమారుడు ఉదయ్‌లు మోటార్ సైకిల్‌పై పెద్దకడుబూరుకు బయలుదేరారు. బనవాసి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న స్కూటర్ ఢీ కొనటంతో ఎగిరి కిందపడ్డారు. ప్రభుదాస్ రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడేమృతి చెందాడు. కుమారుడు ఉదయ్ రోడ్డు పక్కన మట్టిరోడ్డుపై పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెండు రోజుల్లో కుమార్తె వివాహం జరుగుతుందని అందరూ సంతోషంగా ఉన్న తరుణంలో తండ్రి ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అనాథలయ్యారు.
పౌర్ణమి పండుగకు వెళ్తూ..
చిన్నతుంబళానికి చెందిన కడుబురప్ప, ఉరుకుందమ్మల కుమారుడు బోయ రవి(22)కి ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి రాధికతో మూడు నెలల క్రితం పెళ్లి జరిగింది. బోయ రవి భార్య రాధిక పుట్టింటికి ఏరువాక పౌర్ణమి పండగకు వెళ్లారు. సోమవారం అత్తగారి ఊర్లో ఏరువాక పౌర్ణమి పండగకు వెళ్లేందుకు చిన్నతుంబళం నుంచి మోటార్ బైక్‌పై బోయ రవి బయలుదేరాడు. బనవాసి దగ్గర ఎదురుగా వస్తున్న మోటార్ బైక్ ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలుసుకొని ప్రభుత్వాసుపత్రికి కుటుంబ సభ్యులతో కలసి భార్య రాధిక వచ్చారు. అంబులెన్స్‌లో ఉంచిన మృతదేహాన్ని చూసి ‘లే మామ.. మన ఊరికి వెళ్దాం’ అంటూ రోదించారు. హెల్మెట్ ఉన్నా బోయ రవి ధరించకపోవటంతోనే తలకు బలమైన గాయం అయినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
ప్రభుదాస్, బోయ రవి (ఫైల్)
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
బనవాసి సమీపంలో దుర్ఘటన
గాయాలతో బయటపడ్డ బాలుడు


