● వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు
చేయడం అత్యంత దుర్మార్గం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి
చిప్పగిరి: రాజధాని ప్రాంతం ఏమైనా టీడీపీ నేతల జాగీరా అని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ప్రశ్నించారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంత రైతుల అభ్యర్థన మేరకు పరిశీలనకు ఉండవల్లికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ గుండాలు దాడి చేయడం దుర్మార్గమన్నారు. రాజధానికి భూములివ్వని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతుల పక్షాన వెళితే వారిని పథకం ప్రకారం దాడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. లోకేష్ అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం తారా స్థాయికి చేరిందన్నారు. గ్రాఫిక్స్ చూపిస్తూ సీఎం చంద్రబాబు తమను మోసం చేస్తున్నారని రాజధాని ప్రాంత రైతులు తెలుసుకున్నారన్నారు. అందుకే రెండో దఫా భూములు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదన్నారు. త్వరలో రాజధాని ప్రాంత రైతులే తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. శనివారం జరిగిన దాడి ఘటన సంబంధించి ఎంత మందిపై కేసు నమోదు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పినా హోమంత్రి నోరు మెదపడం లేదన్నారు. ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండబోదని పోలీసులు గుర్తించుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బుసినె చంద్రశేఖర్, హనుమంతు, మహానంది తదితరులు పాల్గొన్నారు.


