నందవరం: మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బాల సాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న రచించిన 99వ పుస్తకం ‘ప్రసన్న వదనం’ ఆవిష్కరణ ఆదివారం శంకర మఠం, ఖండేరి కోట కర్నూలులో జరిగింది. సాహితీ సదస్సు– కర్నూలు వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు కళారత్న చంద్రశేఖర్ కల్కూర, జె. ఎస్.ఆర్.కె శర్మ, కవి ఎలమర్తి రమణయ్య, ప్రముఖుల చేతుల మీదుగా చేతుల పుస్తకావిష్కరణ గావించారు. అనంతరం గద్వాల సోమన్నను ప్రముఖులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు డా.దండెబోయిన పార్వతి, వ్యాఖ్యాత ఆకాశవాణి కండె సునీత, కవులు ఆరెకటిక నాగేశ్వరరావు, గద్వాల్ ఈరన్న దంపతులు, జహీర్, వేద విద్యార్థులు పాల్గొన్నారు.
మౌలాలి స్వామి పీరుపై
బంగారు మాయం
కొలిమిగుండ్ల(అవుకు): మొహర్రం వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో పట్టణంలోని తేరు వద్ద ఉన్న మౌలాలి స్వామి పీరుపై అలంకరించిన బంగారు వస్తువును గుర్తుతెలియని వ్యక్తులు తస్కరించారు. పీర్ల చావిడి ఉత్సవ కమిటీ సభ్యులు గుర్తించి ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెద్ద సరిగెత్తు వేడుకల్లో భాగంగా స్వామి పీరును పూలతో అలంకరించారు. అలాగే బంగారుతో చేయించిన వస్తువును నైలాన్ తాడుతో కట్టారు. ఊరేగింపు సమయంలో సందడి నెలకొన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడుతో తాడును కోసి బంగారు వస్తువును అపహరించారు. 12 గ్రాముల బరువున్న వస్తువు రూ.2 లక్షల విలువ చేస్తుందని ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. పీర్ల చావిడిలో ఉండగానే ఘటన జరిగిందా లేక ఊరేగింపు సమయంలో జనసమూహంలో చోటు చేసుకుందా అనే వాటిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
మహిళ బలవన్మరణం
కోవెలకుంట్ల: పెద్దకొప్పెర్లకు చెందిన ఓ మహిళ ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రేవనూరు పోలీసులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన కుమ్మరి చిన్నమ్మ(50) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఇంటి ఆవరణలోని బూత్‌రూంలో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
బేతంచెర్ల: మండల పరిధిలోని ఎం.పేండేకల్లు గ్రామంలో అనారోగ్య సమస్యలు, అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాలు తెలిపిన వివరాల మేరకు..ఎం.పేండేకల్లు గ్రామానికి చెందిన మన్నెం జయరాముడు (29) గోరుమానుకొండ ఎంజేపీ స్కూలు వాచ్‌మెన్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో ఎడమ చేతికి గాయమైంది. ఇదే సమయంలో ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు పెరిగాయి. తీర్చే మార్గం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య బిందుతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
కారు ఢీకొని వృద్ధుడి మృతి
ఆదోని అర్బన్: పట్టణంలోని విక్టోరియాపేటకు చెందిన కురువ పాండురంగ(70) అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఆదివారం ఉదయం బైక్‌పై పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా బైపాస్ రోడ్డులో అతివేగంగా కారు వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో పాండురంగ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. మృతుడికి భార్య జయమ్మ, ముగ్గురు పిల్లలు సంతానం. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


